కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఆక్సిజన్ రవాణాకు తగినన్ని ట్యాంకర్లు అందుబాటులో లేనందున ఒడిషా నుంచి రాష్ట్రానికి ప్రాణవాయువు తరలించడానికి ప్రత్యేక ఆక్సిజన్ రైళ్ళను నడపాలని వైఎస్సార్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మకు విజ్ఞప్తి చేస్తూ మంగళవారం లేఖ రాశారు. ఒడిషా నుంచి ఆక్సిజన్ రవాణాలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇబ్బందులను ఆయన లేఖలో వివరించారు. సకాలంలో ఆక్సిజన్ రవాణా ద్వారా వేలాది మంది కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో భారతీయ రైల్వేలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆక్సిజన్ రైళ్ళు విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్‌లో నమోదైన అత్యధిక కోవిడ్ కేసుల కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో కేసులు ఇప్పుడు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయని.. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అవసరం అపరిమితంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ఆక్సిజన్ ఆవశ్యకత కీలకంగా మారిందని.. తగినంత ఆక్సిజన్ సరఫరా కేటాయింపు, రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడిందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. ఆపత్కాలంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరుతూ ఇప్పటికే తాను ఢిల్లీలోని అనేక మంది ఉన్నతాధికారుల సహాయాన్ని అర్థించానని చెప్పారు. ఒడిషా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ రవాణా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్. కరికాల్ వలవన్‌తో ఆక్సిజన్ రైళ్ళ నిర్వహణను సమన్వయం చేసుకునేలా రైల్వే జీఎంలకు తగిన సూచనలు చేయవలసిందిగా విజయసాయి రెడ్డి రైల్వే బోర్డు చైర్మన్‌కు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.