రాష్ట్రంతో పాటు మొత్తం దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ రెండో దశలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని, దీన్ని కొనసాగిస్తూ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో కోవిడ్‌పై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ మురళీధర్‌రెడ్డి జిల్లాలో కోవిడ్ కట్టడితో పాటు రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలోని అన్ని డివిజన్లలో గత వారం రోజుల్లో పాజిటివిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా రోజుకు ఎనిమిది వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రధానంగా ఫోకస్డ్ టెస్టింగ్‌పై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, జీజీహెచ్‌లో ఇటీవల 1.7 కేఎల్ పీఎస్ఏ యూనిట్‌ను ప్రారంభించామని, 10 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. పెద్దాపురంలో రోజుకు నాలుగు కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఆక్సిజన్ యూనిట్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని, ఆంధ్రా పేపర్‌మిల్లులో 15 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ప్లాంటు కార్యకలాపాలు రెండు రోజుల ముందు పునఃప్రారంభమైనట్లు తెలిపారు. రాజోలులో నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని.. మోరి, కపిలేశ్వరపురంలోనూ కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ లభ్యతతో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6000 పడకల సామర్థ్యంతో సేవలందిస్తున్న బోడసకుర్రు, కాకినాడ జేఎన్టీయూ, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాలతో పాటు ఎటపాక, రంపచోడవరం డివిజన్లలోనూ సీసీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుతామని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహాయం చేసేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు. జిల్లాలో ఈ నెలాఖరుకు రెండో డోసు పెండింగ్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు శాశ్వత టీకా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు టోకెన్లు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చూడాలని, విపత్తును ఎదుర్కోవడమనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిరంతరం కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ఆలోచిస్తూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోందని, ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి, పరిష్కరిస్తూ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. 104 వ్యవస్థ ద్వారా బాధితులకు సకాలంలో సేవలు అందేలా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్‌పై ఎలాంటి అపోహలు వద్దని, కేంద్రం నుంచి వస్తున్న డోసులను బట్టి కార్యక్రమం సజావుగా సాగుతుందని తెలిపారు. కోవిడ్ కట్టడిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీలో ప్రజాప్రతినిధులు అందించే విలువైన సూచనలను స్వీకరించి, అమలుచేసేందుకు కృషిచేయనున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రెమ్‌డెసివిర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సి ఉందని, స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఈ ఔషధాన్ని అవసరం మేరకు వినియోగించాలే తప్ప ఇష్టమొచ్చినట్లు ఉపయోగించకూడదని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం 24X7 పనిచేస్తోందని, తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలేవైనా ఉంటే గుర్తించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక డివిజన్లో బాధితుల అవసరాలు తీర్చేలా పీఎస్ఏ ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాస్థాయిలో పరీక్షలు, బాధితులకు వైద్య సేవలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మందికి సేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రజల్లో కోవిడ్‌ను ఎదుర్కోవడంపై మరింత అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నవారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, బాధితుల్లో ధైర్యం నింపి మహమ్మారి నుంచి బయటపడేలా చూడాలని అమలాపురం ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామ, వార్డు వాలంటీర్లు మరింత కీలకంగా వ్యహరించేలా చూడాలని సూచించారు. క్రిటికల్ కేర్ చికిత్సకు ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రాం సూచించారు. ఇప్పటికే తాము జగనన్న ప్రాణవాయు రథచక్రాలు వ్యవస్థపై దృష్టిసారించామని తెలిపారు. ఆధునికీకరణ చర్యల ద్వారా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వైద్య సేవలు, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, కాన్సంట్రేటర్ల అందుబాటు, అత్యవసర వినియోగ ఔషధాలు; పడకల పెంపు, టెస్టింగ్, వ్యాక్సినేషన్, చమురు సంస్థల సీఎస్ఆర్ కార్యకలాపాల పెంపు, భౌతికకాయాల తరలింపు, గౌరవప్రద అంతిమ సంస్కారాలు తదితరాలపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అనపర్తి ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మండపేట ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు పలు సూచనలు చేశారు. వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అమలాపురం సబ్‌కలెక్టర్ హిమాన్షు కౌశిక్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.