తేరన్నపల్లి చిన్నారులకు సురక్షిత ఆశ్రయం..


Ens Balu
2
Tadipatri
2021-05-12 15:48:40

కరోనా కేసులు రోజురోజుకూ  పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో తల్లిదండ్రులకు కరోనా సోకడంతో, ఇంట్లో ఒంటరిగా వున్న ముగ్గురు పిల్లల బాధ్యతను బాలల సంరక్షణ సమితికి అప్పగించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసు గల బాలుడు, ఐదేళ్లు, మూడేళ్ల వయసుగల బాలికలను ప్రస్తుతం బుక్కరాయముద్రంలోని ఆర్డీటీ సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. ముగ్గురు పిల్లలకు కరోనా సోకలేదని, సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులకు తెలిపామన్నారు. పిల్లలకు కరోనా సోకకుండా బాలల సంరక్షణ కేంద్రాలు (సిసిఐ) అన్ని జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. పిల్లలకు, సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలను సంరక్షించేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాంటి బాధిత పిల్లలు ఉంటే 1098, 181 వంటి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. బాల బాలికలకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కరోనా రాకుండా పిల్లలను కాపాడుతున్నామని వివరించారు. 

కోవిడ్ 19 వైరస్ సోకి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లేదా మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ,  బాలల సంక్షేమ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో  బుక్కరాయ సముద్రం నందుగల ఆర్డీటీ పాఠశాలలో   బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో కూడిన తాత్కాలిక  వసతిని ఏర్పాటు చేశామని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి తెలిపారు. 

 సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో బాల, బాలికలకు ప్రత్యేక సంరక్షణ  కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల సంరక్షణపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చారన్నారు.