మూడేళ్లు వరుసగా రైతు భరోసా..
Ens Balu
1
Visakhapatnam
2021-05-13 13:09:45
వైఎస్ఆర్ రైతు భరోసా పథకం లో వరుసగా 3వ ఏడాది తొలి విడత సాయం కింద రాష్ట్రంలో 52.38 లక్షల మంది రైతులకు రూ . 3,928.88 కోట్లు సాయం అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసారు. ప్రస్తుతం ఖరీఫ్ కు ముందు మొదటి విడత కింద రూ. 7,500 అందజేస్తున్నామని తెలిపారు. రెండవ వాయిదా రూ. 4000 అక్టోబరు నెలలో , మూడవ వాయిదా రూ.2000 జనవరి నెలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని తెలిపారు. విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు , జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాల రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయం కొరకు పెట్టుబడి సాయం కింద రైతులకు 3వాయిదాలలో రూ. 13,500 లు వారి ఖాతాలలోకి జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే భూమిలేని కౌలు రైతులకు, దేవదాయ భూముల రైతులకు ఇనామ్ భూముల రైతులకు, ప్రభుత్వ మరియు ఇతర భూములు సాగు చేయుచున్న వారికి రెండు వాయిదాలలో అక్టోబరు నెలలో రూ. 11,500/- మరియు జనవరి నెలలో రూ. 2000/- రైతు భరోసా కింద మంజూరు చేస్తారని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 3,46,679 మంది రైతులకు రూ. 260 కోట్లు మరియు 39,845 మంది అటవీ భూములు కలిగిన రైతులకు రూ. 29.88 కోట్లు మొత్తం రూ. 289.88 కోట్లు వారి బ్యాంకు ఖాతాలలోకి జమ చేసామని తెలిపారు.