కోవిడ్‌ను కేసులను గణనీయంగా తగ్గించడం ద్వారా నెల రోజుల్లో జిల్లాలో సాధారణ పరిస్థితులను తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. దీనికోసం గ్రామస్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకూ, యంత్రాంగమంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్యారోగ్యశాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, తాశీల్దార్లతో, కలెక్టర్ గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న ఫీవర్ సర్వే, వేక్సినేషన్ ప్రక్రియను సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు పటిష్టమైన కార్యాచరణ ద్వారా, వచ్చేనెల ఇదే సమయానికి కోవిడ్ కేసుల సంఖ్యను రెండంకెలకు పరిమితం చేయాలన్నారు. దీనికోసం రెండెంచల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒకవైపు కరోనాను కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవడం తోపాటు, వ్యాధి సోకినవారికి సమర్థవంతమైన చికిత్సను అందించి, పూర్తిగా నయం చేయడం మన లక్ష్యాలు కావాలని సూచించారు. ఇది జరగాలంటే, వ్యాధిపట్ల ప్రతీఒక్కరిలో అవగాహన పెంచాలని సూచించారు. కోవిడ్ వ్యాధి నియంత్రణకు కేవలం అవగాహన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానం మహారాష్ట్రలో వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాన్ని ఇచ్చిందని, అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. ముందుగా వ్యాధి సోకినవారిని గుర్తించి, వారిని క్వారంటైన్ చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిచెందకుండా అడ్డుకోవచ్చని, దీనికి ఫీవర్ సర్వే దోహదపడుతుందని అన్నారు.
కోవిడ్ సంక్షోభ సమయంలో వివిధ రకాల మోసాలు, దోపిడీ జరిగే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ వీటిని జరగనివ్వకూడదని కోరారు. మోసాలను అరికట్టడంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు క్రియాశీల పాత్రను పోషించాలని ఆదేశించారు. ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఇదే అదునుగా రోగులను దోచుకొనే అవకాశం ఉందని, దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే అంబులెన్సులు, టెస్టులు, వేక్సిన్‌లు, దహన కార్యక్రమాలు, రవాణా ఛార్జీలకూ కూడా అధికంగా వసూలు చేసే అవకాశం ఉందన్నారు. నిత్యావసరాల ధరలను కూడా విపరీతంగా పెంచే అవకాశం ఉందని, వాటిని అరికట్టాలన్నారు. వీటన్నిటిపైనా క్షేత్రస్థాయిలో అధికారులు దృష్టిపెట్టి, వాటిని అరికట్టాలని, ప్రజలకు భరోసాను కల్పించి, ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ కోరారు.