కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన పిల్లల సంరక్షణకు జిల్లా కలెక్టర్, జిల్లా బాలల సంరక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా 18 ఏళ్లలోపు బాల బాలికల కోసం వేర్వేరుగా రెండు సంరక్షణా గృహాలను ఏర్పాటు చేశారు. బాలురకు విజయనగరం కంటోన్మెంటులోని బ్రైటర్ ఫ్యూచర్ సంస్థలో, బాలికలకు బొబ్బిలి మండలం కారాడలోని సన్‌రైజ్ చిల్ట్రన్ హోమ్‌లో వసతి కల్పిస్తారు. చంటిపిల్లలను శిశుగృహాల్లో చేరుస్తారు. కోవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయి, సంరక్షకులు ఎవరూ లేని పిల్లలకు ఈ గృహాల్లో వసతి కల్పించి, పునరావాసాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే కోవిడ్ కారణంగా తల్లితండ్రులు ఇద్దరూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమయంలో, సంరక్షణకు ఎవరూ లేని పిల్లలకు కూడా తాత్కాలికంగా ఈ సంరక్షణా గృహాల్లో వసతి కల్పిస్తారు. అయితే ఈ గృహాలకు వచ్చే పిల్లలకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి. జిల్లా బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధిబాలల సంక్షేమశాఖ మరియు మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంక్షేమ గృహాలు నడపడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి ఈ గృహాలను సందర్శించి, వసతులను పరిశీలించారు. సంరక్షణ అవసరం ఉన్న పిల్లలను చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబరు 1098 లేదా మహిళా హెల్ప్‌లైన్ నెం.181కి ఫోన్ చేసి, ఈ సంరక్షణా గృహాల్లో చేర్చాలని కలెక్టర్ హరి జవహర్ లాల్ కోరారు.