ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం వెలగపూడిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో వరుసగా మూడవ ఏడాది వై.ఎస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం కింద 2021 - 22 సంవత్సరానికి గాను మొదటి విడత లబ్ధిని రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటు అధునాతన పద్ధతుల ద్వారా లాభసాటి వ్యవసాయం చేయడం పై అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500/- రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతున్నదని, రైతులకు లబ్ధి చేకూరేలా, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కష్టపడి పని చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
ప్రభుత్వ విప్ మరియు చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత సువిశాల భారతావనిలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అనేక రాష్ట్రాలలో పరిపాలించారని, రైతును రాజును చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి, మహనీయుడు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, పాత బకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ ను ఇస్తూ, 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తూ, రైతు ధైర్యంగా పొలానికి వెళ్ళే పరిస్థితిని తెచ్చిన ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని, ఆ తరువాత ఆ తండ్రి ఆశయాలకు వారసుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేను ఉన్నానని, రైతుల కష్టాలను తెలుసుకుని, రైతులకు భరోసాగా ఉంటూ రైతు రాజ్యాన్ని తీసుకుని వచ్చేందుకు ప్రతి ఖరీఫ్ కు, రబీకి సహాయం అందించేందుకు రైతు భరోసా పథకంను అమలు చేస్తూ రైతుల పక్షపాతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.