అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఇంటింటికి ఫీవర్ సర్వే అనే దానిని నిరంతరం కొనసాగించాలని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం కోవిడ్ -19 (సెకండ్ వేవ్) యొక్క వ్యాప్తి మరియు నియంత్రణపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా.. డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాలు నుంచి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ,ఎమ్మెల్సీ శమంతకమణి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు తదితరులు వారి వారి ప్రాంతాల నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి వీలుగా జిల్లాకు మరో 5 టన్నుల ఆక్సిజన్ ను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆక్సిజన్ నిల్వల కోసం అవసరమైతే ట్యాంకర్లను లీజు ప్రాతిపదికన సమకూర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. అనంతపురం జిల్లా కోవిడ్ టాస్క్ ఫోర్సు తోనూ, ప్రజాప్రతినిధులతోనూ గురువారం నాడు ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జి. చంద్రుడు జిల్లాలోని పరిస్థితులు, ప్రజలకు కల్పిస్తున్న సేవల గురించి వివరించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణ చర్యల్లో అధికార యంత్రాగం మరింత చురుకుగా పాల్గొంటున్నారని అభినందించారు. జిల్లా స్థాయిలో కొన్ని కీలకమైన పోస్టుల్లో అధికారులు లేకపోవడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను గమనించి, వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అంబులెన్సుల నిర్వాహకులు ఇష్టారీతిన రేట్లు వసూలు చేయకుండా, వారితో సమావేశాలు నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని ఈ విషయంలో ఎటువంటి తాత్సారం చేయవద్దని జిల్లా పోలీసులను మంత్రి ఆదేశించారు. డబ్బులు ముఖ్యం కాదని మానవతా థృక్పధం ప్రధానమన్న విషయాన్ని ముఖ్యమంత్రి వైయస జగన్ మోహన్ రెడ్డి గారు పదే పదే చెపుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాగం వ్యవహరించాలన్నారు. దురదృష్ట వశాత్తూ మరణాలు సంభవించిన సందర్భాల్లో వారి తాలూకు బంధువులు మృత దేహాలని తీసుకెళ్లని పక్షంలో వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడంలో రాజీ పడవద్దని, ఇప్పటికే పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు, నగర పంచాయితీల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని ఈ విషయంలో నిర్లిప్తతను సహించబోమని మంత్రి హెచ్చరించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న ప్రజా ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న వాటికి సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు అయ్యేలా చూస్తామన్నారు.
జిల్లాలో ఇప్పటికే ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును సమీక్షిస్తూ, ఈ రకమైన సర్వేలు నిరంతరం నిర్వహించాలని, ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి జిల్లా మొత్తంలో ఈ రకమైన సర్వే చేపట్టాలని దీనివల్ల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు, వ్యాధి ప్రబలకుండా నియంత్రణ కూడా సులభతరమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ఇతరుల అభిప్రాయాలకు అనుగుణంగా, కోవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ సదుపాయం, మందుల లభ్యత, డాక్టర్ల పర్యవేక్షణ తదితర అంశాలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.