ఆక్సిజన్ వినియోగంపై స్టేట్ కమిటీ ఏర్పాటు..
Ens Balu
4
Kakinada
2021-05-14 11:22:07
కోవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ పరిమాణం, వినియోగం తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటైందని, ఈ వ్యవస్థకు అనుసంధానంగా జిల్లా స్థాయిలోనూ స్పెషల్ సెల్ పనిచేస్తోందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జేసీ వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోజువారీ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచి ప్రాణనష్టం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసిందన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రతి రెండు గంటలకు ఒకసారి http://pranavayuvu.ap.gov.in వెబ్‌సైట్లో మెడికల్ ఆక్సిజన్‌కు సంబంధించిన రియల్‌టైమ్ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా లాగిన్‌లు అందించామని, ఈ సమాచారాన్ని రాష్ట్రస్థాయితో పాటు జిల్లాస్థాయిలోనూ సమీక్షించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ప్రతి కోవిడ్ ఆసుపత్రిలోనూ అవసరం మేరకు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడొచ్చని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా సంస్థల రోజువారీ నిల్వల పైనా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆక్సిజన్‌పై పర్యవేక్షణకు ప్రతి అయిదు ఆసుపత్రులకు ఒక ప్రత్యేక అధికారి పనిచేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో జిల్లాలోని నోటిఫైడ్ కోవిడ్ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.