సోంపేట తహశీల్దార్ గురు ప్రసాద్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. శుక్రవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ మంచి పని చేస్తున్నారని ఆయన పేర్కొంటూ సోంపేట తహశీల్దార్ సకాలంలో స్పందించి అంబులెన్స్ డ్రైవర్ గా మారి ఆస్పత్రికి కోవిడ్ బాధితుని చేర్చడం ఎంతో ఊరట ఇచ్చిన అంశమని అన్నారు. కోవిడ్ లో అందిస్తున్న సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని, ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం అందరూ మంచి పనితీరును కనబరుస్తున్నారని అయితే కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంలో విఫలమైతే ఇప్పటి వరకు పడిన కష్టం వృథా అవుతుందని ఆయన అన్నారు. కర్ఫ్యూ సమయంలో కేసులు తగ్గాయని, ఇదే సమయాన్ని అదునుగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి మండలంలో కనీసం 30, 40 మంది వరకు కరోనా లక్షణాలతో ఉండేవారు ఉంటారని వారిని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంలో విఫలమైతే మిగతా వారికి వ్యాప్తి చేసే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించాలని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడైతే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోవిడ్ బాధితులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్ సర్వేలియన్స్ అధికారులతో డివిజనల్ అధికారులు సమావేశం నిర్వహించి ఫీవర్ సర్వే పరిస్థితులు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఐదు కంటే తక్కువ కేసులు గుర్తించిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అవసరమైతే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి సచివాలయానికి వాలంటీర్లతో మేపింగ్ చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని ఇంకా మెరుగైన పరిస్థితి కి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఒక్క కేసును కూడా వదిలి పెట్టరాదని జిల్లా కలెక్టర్ చెప్పారు. మండల స్థాయిలో చేపడుతున్న కోవిడ్ సేవలను ప్రజలకు తెలియజేయాలని, తద్వారా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అంశాలను గూర్చి అందరికీ అవగాహన కలుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హొమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ బాధితులను పరిశీలించాలని అన్నారు. మెడికల్ కిట్లను అందజేయాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ. కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్, మండల ప్రత్యేక అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.