కోవిడ్ రెండోదశ ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలకు ఆపన్నహస్తం అందించడం సామాజిక బాధ్యతగా భావించి జిల్లాలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ముందుకొచ్చి జీజీహెచ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మరికొంతమంది దాతలు ముందుకొచ్చి కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలకు సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో దేవీ ఫిషరీస్ లిమిటెడ్ ప్రతినిధులు.. మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి తదితరుల చేతుల మీదుగా దాదాపు రూ.21 లక్షల విలువైన వైద్య సామాగ్రిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మికి జేశారు. అదే విధంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పది కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్‌ను, ఈఎన్‌టీ బ్లాక్ వద్ద ఆధునికీకరించిన ట్రయాజ్ సెంటర్‌లోని 24 పడకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం దేశమంతా కోవిడ్ భయాందోళనలతో ఉందని, ఇలాంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అత్యధిక జనాభా గల జిల్లాలో అధికార యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో కోవిడ్ కట్టడికి, రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు కృషిచేస్తోందని పేర్కొన్నారు. 24X7 పనిచేస్తూ ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్య శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారన్నారు. జీజీహెచ్‌లో ఇప్పటికే 20 కేఎల్ స్టోరేజ్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంక్ ఉందని, ప్రస్తుతం మరో పది కేఎల్ సామర్థ్యమున్న ట్యాంక్ అందుబాటులోకి రావడం వల్ల ఆసుపత్రి మొత్తానికి ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. ఈ కొత్త ట్యాంకును యుద్ధప్రాతిపదికన పది రోజుల్లోనే ఏర్పాటుచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి సైతం జీజీహెచ్‌కు వైద్యం కోసం వస్తున్నారని, ఈ నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా సంస్థలు ముందుకొచ్చి సహాయమందించాలని సూచించారు. ప్రజల్లో కోవిడ్‌పై ఉన్న భయాందోళనలను తొలగించి, అవగాహన కల్పించి కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సహకరించాలని మీడియాకు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సూచించారు.
104 సేవల విస్తరణకు కృషి: కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి:
కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ రెండోదశ ప్రారంభమైన తర్వాత అత్యధికంగా ప్రస్తుతం రోజుకు దాదాపు 3,500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, దాదాపు 30 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరముందని, అవసరం మేరకు వివిధ ప్రాంతాల్లో కోవిడ్ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించామని, సోమవారం నాటికి కనీసం 50 పడకలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లోనూ అనుభవమున్న జిల్లాస్థయి అధికారులతో ఇటీవల తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా 50 శాతం పడకలు, రెమ్‌డెసివిర్ సక్రమ వినియోగం, నాన్ ఆరోగ్యశ్రీ రోగుల నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజుల వసూలు తదితర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. 104 కాల్‌సెంటర్ సేవలకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రోజుకు 1500 వరకు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, తాజాగా 104 సేవలను మరింత విస్తరించేందుకు వీలుగా మహిళా పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రతి రోగితో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఐసోలేషన్‌కిట్ అందించడం లేదా సీసీసీ, ఆసుపత్రి అడ్మిషన్ తదితర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డివిజన్ స్థాయిలోనూ కాల్‌సెంటర్లను ఏర్పాటుచేసి, కోవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపి, వేగంగా కొలుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యవసర వైద్య సేవలు కోసం వచ్చేవారికి పడకలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, ఆరోగ్యం బాగున్నవారిని డిశ్చార్జ్ లేదా సీసీసీకి పంపించడం జరుగుతుందన్నారు. రోగుల బంధువులు కూడా ఈ విషయంలో సహకరించాలని కోరారు. ముంబయి కార్పొరేషన్‌లో కోవిడ్ కట్టడి, రోగులకు వైద్య, ఇతర సేవలు అందిస్తున్న తీరును అధ్యయనం చేశామని.. సాధ్యాసాధ్యాలను బట్టి జిల్లాలోనూ ముంబయి మోడల్ అమలుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం జీజీహెచ్‌లో కోవిడ్ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న హెడ్‌నర్స్, స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు, ఇతర సిబ్బంది మొత్తం 19 మందిని మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ గీతాంజలిశర్మ, జీజీహెచ్ కోవిడ్ నోడల్ అధికారి సూర్య ప్రవీణ్‌చాంద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఆర్.మహాలక్ష్మి, ఆర్ఎంవో డా. ఇ.గిరిధర్, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.