మందులు కన్నా.. మాత్రల కన్నా.. మనోధైర్యమే గొప్పది.. దాన్ని కోల్పోకండి.. ధైర్యంగా ఉండండి.. అంటూ కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ కరోనా రోగులకు ధైర్యం చెప్పారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీకేం కాదు.. మీ వెంట మేమున్నాం అని భరోసా ఇచ్చారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల్లో మనోధైర్యం నింపేందుకు కలెక్టర్ శుక్రవారం జూమ్ యాప్ ద్వారా వారితో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని మహారాజా, మిమ్స్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్యసేవలు, భోజన వసతి, టాయిలెట్ల పరిశుభ్రత తదితర అంశాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయా ఆసుపత్రుల్లోని వార్డుల్లో వైద్య సేవలందిస్తున్న వైద్యుల సాయంతో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ముందుగా స్థానిక మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. జగదీష్, హరిదుర్గ, మరొక మహిళతో కాసేపు మాట్లాడారు. అక్కడ అందుతున్నసేవలపై ఆరా తీశారు. టాయిలెట్లు శుభ్రంగా ఉండటం లేదని ఒక వ్యాధిగ్రస్తురాలు తెలుపగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజుని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మరో ముగ్గురు రోగులతో మాట్లాడి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. చిన్న పిల్లల వార్డులో ఉన్న డా. అనూష శ్రీని అక్కడ వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మందులు ఇండెంట్ ప్రకారం రావటం లేదని ఆమె చెప్పగా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని జేసీ మహేష్ కుమార్ బదులిచ్చారు. అలాగే వైద్యులు రోజూ వచ్చి బోర్లా పడుకోబెడుతున్నారా అని మిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎన్. త్రినాథ్‌ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న సేవలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.
కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, జేసీలతోపాటు డీఎం & హెచ్‌వో పి. రమణ కుమారి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, మహారాజ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, మిమ్స్ డైరెక్టర్ డా. భాస్కర రాజు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.