తాడిపత్రి సమీపంలో అర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల తాత్కాలిక ఆసుపత్రి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్ణీత సమయానికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టరును మరియు సంబంధిత అధికారులను అదేశించారు. నేటి నుంచి పదిరోజుల్లో ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిగా ఆనంతపురము ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డిని నియమించారు. రేయింబవళ్లు నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని అవసరమైతే మరింత మంది సిబ్బందిని నియమించుకోవాలన్నారు. పర్యవేక్షణ అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడిపత్రి వద్ద తాత్కాలిక ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. పేరుకు మాత్రమే ఇది తాత్కాలిక ఆసుపత్రి అని, ఒక పూర్తిస్థాయి ఆసుపత్రిలో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. వైద్యులు, నర్సులు, కోవిడ్ ను ఎదుర్కొనేందుకు మందులు, కోవిడ్ బాధితులకు భోజనం-నీటి వసతి, శౌచాలయాలు, వైద్య సిబ్బందికి కావాల్సిన వసతి సౌకర్యాలు అన్నీ ఉండనున్నాయన్నారు. కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ఖర్చుకు వెనకడకుండా ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నాయన్నారు. ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్(రెవెన్యూ), ట్రైనీ కలెక్టర్ సూర్య తేజ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.