8నెలల గర్భిణీ.. ప్రజాసేవకే అన్నపూర్ణ..


Ens Balu
2
Jiyyammavalasa
2021-05-15 06:13:10

ఆమె పేరు అన్నపూర్ణ. సాధాసీదా ఉద్యోగం. కానీ ఆమె అందించే సేవ‌లు మాత్రం ప‌రిపూర్ణం. ప్ర‌స్తుతం ఆమె ఎనిమిదో నెల గ‌ర్భిణి. అయినా ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా.. అధైర్య‌ప‌డ‌కుండా త‌న క‌ర్తవ్యాన్ని నిర్వ‌ర్తిస్తోంది. క‌రోనాలాంటి విప‌త్క‌ర పరిస్థితుల్లో కూడా త‌న అమూల్య‌మైన సేవ‌లందిస్తూ ప్ర‌శంస‌లు పొందుతోంది. ధైర్యంగా ఉందాం.. క‌రోనాని జ‌యిద్దాం అని అందరిలో స్ఫూర్తి నింపుతున్న ఏఎన్ఎం అన్న‌పూర్ణ విజ‌య‌గాథ ఇది.  అన్న‌పూర్ణ ప్ర‌స్తుతం జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలందిస్తోంది. వృత్తిపై నిబ‌ద్ధ‌త క‌న‌బ‌రుస్తూ మిగ‌తా వారిలో స్ఫూర్తి నింపుతోంది. రోజూ ఉద‌యమే కార్యాల‌యానికి రావటం.. త‌నకి అప్ప‌గించిన ప‌ని చేయ‌టం ఈమె ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం పీహెచ్‌సీకి వ‌స్తున్న క‌రోనా రోగుల‌కు కూడా ఈమె సేవ‌లందించ‌టం హ‌ర్ష‌ణీయం. గ‌ర్భిణి కావ‌టంతో క‌రోనా విధులకు వెళ్లొద్ద‌ని వైద్యులు చెప్పినా.. త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకొంటూ సాధార‌ణ రోగుల‌తో పాటు క‌రోనా రోగుల‌కు కూడా సేవ‌లందించ‌టం గ‌ర్వ‌కార‌ణం. అంతే కాదు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కూడా పాల్గొని వ‌చ్చిన వారికి టీకా వేస్తోంది. అమూల్య‌మైన సేవ‌లందించ‌టం ప్ర‌శంస‌నీయం. 

వైద్యులు విశ్రాంతి తీసుకోమ‌ని చెప్పినా..

అన్న‌పూర్ణ గ‌ర్భిణి కావ‌టంతో విశ్రాంతి తీసుకోమ‌ని వైద్యులు చెప్పారు. మిగ‌తా వారు చూసుకుంటారులే అని సూచించారు. అయినా ఇప్ప‌డు కాకపోతే.. మ‌రింకెప్పుడు సాయ‌ప‌డ‌తామ‌ని అన్న‌పూర్ణ నిర్ణ‌యించుకొంది. సాధార‌ణ రోగుల‌ను త‌న సొంత మ‌నుషుల వ‌లే చూసుకుంటూ సేవ‌లందిస్తోంది. అలాగే క‌రోనా టెస్టులు నిమిత్తం శాంపిల్స్ క‌లెక్ట‌ట్ చేయ‌టం.. వ్యాక్సిన్ వేయ‌టం వంటి ప‌నుల్లో భాగ‌స్వామ్య‌మ‌వుతూ మిగిలిన వారిలో స్ఫూర్తి నింపుతోంది. ఈమె అందించే నిష్ఫ‌క్ష‌పాత సేవ‌ల వ‌ల్ల మాపై కొంచెం ప‌ని భారం త‌గ్గుతోందని తోటి ఉద్యోగులు చెప్ప‌టం... అన్న‌పూర్ణ ప‌నిత‌నానికి నిద‌ర్శ‌నం. 

సేవ చేయ‌టంలో ఏదో తెలియ‌ని ఆనందం

ఎ. అన్న‌పూర్ణ‌, ఏఎన్ఎం, రావాడ రామ‌భ‌ద్రపురం పీహెచ్‌సీ వివిధ రోగాల‌తో ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే వారికి సేవలందించ‌టంలో  ఏదో తెలియ‌ని ఆనందం ఉంటుంది. మ‌న‌మందించే సాయం వారికి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. వాళ్ల‌తో ఆత్మీయంగా మాట్లాడితే చాలా సంతోషిస్తారు. అప్పుడ‌ప్ప‌డు ఇబ్బందులున్నా.. క‌రోనా లాంటి స‌మ‌యంలో కూడా సేవ‌లందిస్తున్నందుకు లోలోప‌ల చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంటిలో వాళ్లు, తోటి ఉద్యోగులు నాకు అండ‌గా ఉండ‌టంతోనే ఇదంతా సాధ్య‌ప‌డింది. మా ఉన్న‌తాధికారులు ఎప్పడూ ధైర్యం చెబుతూ నా పనిలో సాయ ప‌డ‌తారు. నాకు అండ‌గా నిలుస్తున్నారు. వారికి నా ధ‌న్య‌వాదాలు.