రాష్ట్రంలోని విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ కోవిడ్ టీకా వేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు చెప్పారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉన్నందు వలన విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. ఈ సమయంలో విద్యుత్ ఉద్యోగులకు పనికూడా అధికంగా వుంటుందని అన్నారు. ఇలాంటి సమయంలో ఫీల్డుకెళ్లే సిబ్బంది, అధికారులు రక్షణార్ధం ఉద్యోగులందరికీ వేక్సిన్ వేయడం ద్వారా కాస్త భరోసా కలుగుతుందన్నారు. అంతేకాకుండా దైర్యంగా విధులు నిర్వహించడానికి వీలుపడుతుందని వివరించారు. ఈ సాంకేతిక అంశాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్టు చెప్పారు. విధినిర్వహణలో కోవిడ్ తో మ్రుతిచెందిన విద్యుత్ ఉద్యోగులకు రూ.50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, కోవిడ్ వైరస్ సోకిన సిబ్బంది, ఉద్యోగులు క్రెడిట్ కార్డుపై వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించాలని శ్రీనివాసరావు ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు.