104 కాల్ సెంటర్ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం..


Ens Balu
4
Kakinada
2021-05-15 10:25:28

తూర్పుగోదావరి జిల్లాలో 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా డివిజన్ స్థాయిలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి రాజకుమారి తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం కోవిడ్- 19 కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాకినాడ  డివిజన్ కు  సంబంధించి మహిళా పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో జేసీ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి  మాట్లాడుతూ జిల్లాలో అన్ని డివిజన్లలో  104 కాల్   సెంటర్ వ్యవస్థను ఏర్పాటు  చేయడం ద్వారా తక్కువ సమయంలో ఫిర్యాదులు పరిష్కరించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో రోజుకు అత్యధిక స్థాయిలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె తెలిపారు. కొవిడ్ పరీక్షలు, హోం ఐసోలేషన్, కొవిడ్ కేర్ సెంటర్, ఆస్పత్రిలో పడకల లభ్యత తదితర అంశాలపై మహిళా పోలీసులకు 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలో జేసి రాజకుమారి ఈ సందర్భంగా మహిళా పోలీసులకు వివరించారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిపాలన అధికారి, మహిళా పోలీసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు