డ్యూటీలకు రానివారిపై చర్యలు తీసుకోండి..
Ens Balu
3
King George Hospital
2021-05-15 11:42:35
కోవిడ్ కేర్ సెంటర్లలో కోవిడ్ రోగుల పట్ల సేవాభావం చూపాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల కెజిహెచ్ లోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం పిపిఈ కిట్లుధరించి సీఎస్ఆర్ కోవిడ్ బ్లాక్ లో పర్యటించారు. కోవిడ్ బాధితులను పరామర్శించారు. బాగా చూస్తున్నారా?ఎక్కడ నుంచి వచ్చారు ?ఎన్ని రోజులయ్యిందంటూ కోవిడ్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. కెషీట్లులు పరిశీలించి ఆక్సిజన్ స్థాయిలపై ఆరాతీశారు. కరోనా వచ్చినా అదైర్య పడొద్దంటూ పేషెంట్లకు ధైర్యం చెప్పారు. వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకోవాలని సూచించారు. బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్న ఆయన..భోజనం సరఫరా బాగుందని కోవిడ్ బాధితులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. షిఫ్టు డ్యూటీ సహాయ ప్రొఫెసర్ విధులకు హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.మైథిలి ని ఆదేశించారు. డ్యూటీ వైద్యులు,స్టాఫ్ నర్స్ లు సక్రమంగా విధులు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శానిటేషన్ చేయాలని చెప్పారు. సూపర్ స్పెషలిటీ వార్డులలో మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ ఎన్ వోలు,ఎం ఎన్ వోలు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.