విమ్స్ లో అదనంగా మరో 200 పడకలు..
Ens Balu
1
VIMS Hospital
2021-05-15 16:08:06
విమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పడకలకు అదనంగా మరో 200 పడకలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆదేశించారు. విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్, రెమిడి సివర్ సరఫరా, ఆహారము, శానిటేషన్, సిబ్బంది, తదితర అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ జి. వెంకట హరి కుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఎపిఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మి, వైద్య సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ 10 KL సరఫరా అవుతుందని, అదనంగా మరో 5 KL సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ సరఫరాపై ప్రతి రోజు పరిశీలించి ఆక్సిజన్ నిల్వ పరిస్థితిని అధికారులకు తెలియజేయాలని, జిల్లా అధికారులతో సమన్వయంతో చేసుకోవాలని ఆక్సిజన్ మేనేజ్ మెంట్ నోడల్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ సమస్య తలెత్తకుండాచూడాలని, ఆక్సిజన్ పై ఫిర్యాదులు రాకుండా చూడాలని డ్రగ్ కంట్రోల్ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు.. ఆక్సిజన్ వృధా కాకుండా నివారించేందుకు పేషెంట్లలో అవగాహన కలిగించాలని, ఇందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి ఆక్సిజన్ మేనేజ్ మెంట్ పై శిక్షణ ఇవ్వాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో ఎవరైనా చేరడానికి వస్తే వారికి పడకలను కేటాయించాలని చెప్పారు. హెల్ప్ డెస్క్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, సిప్టులు వారీగా చేస్తున్నారా లేదా, సిసి కెమేరాలను పరిశీలిస్తున్నారా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అడుగగా 280 వెంటిలేటర్లు ఉన్నాయని, ప్రస్తుతం 140 వెంటిలేటర్లు వాడుకలో ఉన్నాయన్నాయని సంచాలకులు రాంబాబు మంత్రికి వివరించారు. ప్రతి పేషెంటుకు సమయానికి ఆహారం, మందులు సరఫరా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ బాగా చేయాలని, శానిటేషన్ రూల్స్ ప్రకారం చేయాలని, అలా చేయకపోతే కాంట్రాక్టర్ ను మార్చాలన్నారు. వైద్యులు ఎంత మంది ఉన్నారని మంత్రి అడుగగా ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి 130 మంది మిమ్స్ లో పనిచేస్తున్నట్లు ప్రిన్సిపల్ మంత్రికి వివరించారు. మృతదేహాలు తరలింపులో జాప్యం జరగకుండా ఉండాలని జివియంసి సిఎంఓ ను ఆదేశించారు. ప్రస్తుతం 6 ఆంబులెన్స్ లు ఉన్నాయని, మరిన్ని ఆంబులెన్స్ లు అద్దెకు తీసుకొని మృత దేహాలు తరలింపునకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రికి సిఎంఒ వివరించారు. ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆసుపత్రి ప్రొసీజర్ కూడా త్వరితగతిన పూర్తి చేసి మృత దేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని విమ్స్ సంచాలకులను ఆదేశించారు. మరణించిన తర్వాత ఏ సమస్య లేకుండా చూడాలని పర్యాటక శాఖ మంత్రి చెప్పారు. రెమిడెసివర్ మెడికల్ షాపుల్లో దొరకడం లేదని, దీనిపై దృష్టి సారించాలని, నల్ల బజారులో విక్రయించినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని డ్రగ్ కంట్రోల్ ఎడి రజితను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్లు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పడకలు తప్పని సరిగా కేటాయించాలన్నారు. విమ్స్ లో ఉన్న చిన్న చిన్న సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సంచాలకులను ఆదేశించారు.