కరోనా కిట్ల అమ్మకం..ముగ్గురు ఎల్టీల సస్పెన్షన్


Ens Balu
3
Srikakulam
2020-08-27 19:28:38

శ్రీకాకుళం జిల్లాలో  కోవిడ్ – 19 పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం కిట్లను సమకూర్చుతుందని, వాటితో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే కోవిడ్ నమూనా కిట్లను కొంత మంది విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పలాస సామాజిక ఆసుపత్రిలో లాబ్ టెక్నీషియన్లు గిన్ని నారాయణ, సల్లా శ్యామ్ కుమార్., పలాస ముఖ్య మంత్రి ఆరోగ్య కేంద్రం లాబ్ టెక్నీషియన్ గునితి వెంకట రమణ కోవిడ్ - 19 రాపిడ్ కిట్లను రూ. 2 వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు లాబ్ టెక్నీషియన్లను సస్పెన్షన్ చేసామని, వారిపై క్రిమినల్ కేసుకు ఆదేశించామని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎంతో నిబద్ధత, అంకితభావంతో కోవిడ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.