కోవిడ్ కేర్ కేంద్రాల్లో పడకల పెంపునకు చర్యలు..
Ens Balu
1
Kakinada
2021-05-16 08:01:16
ప్రస్తుతం రెండో దశలో ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జిల్లా వ్యాప్తంగా ఉన్న కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ) పడకల సంఖ్యను పెంచుతున్నామని, ఆక్సిజన్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని, సీసీసీల్లో పడకలను పెంచడం వల్ల అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి జేఎన్‌టీయూ కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించారు. తొలుత సీసీసీలోని రిసెప్షన్, రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు? ఇతర పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? పస్తుతం ఏవైనా మందులు వేసుకుంటున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున బ్లాక్‌ను సందర్శించి, అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి కాన్సంట్రేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్న తీరును పరిశీలించారు. మెడికల్, ఇతర వ్యర్ధాల నిర్వహణ ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ బాధితులకు భోజనాన్ని సిద్ధం చేస్తున్న వశిష్ట మెస్‌ను పరిశీలించి, తేలిగ్గా జీర్ణమయ్యే, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. రాగి మాల్ట్, గుడ్లు వంటి వాటితో పాటు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆహారాన్ని అందించాలని సూచించారు. మెడికల్, పారామెడికల్, ఇతర సిబ్బందికి ఉపయోగిస్తున్న నరేంద్ర మెస్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే జేఎన్‌టీయూలో వెయ్యి పడకలు ఉండగా.. 104 కేసులు, కోవిడ్ పాజిటివ్ టీచర్స్, సస్పెక్ట్ కేసులు వంటివాటికోసం అదనంగా 400 పడకల ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించి, గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రంలో ఉన్న ప్రతి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరానికి అనుగుణంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు ఆక్సిజన్ అందించేందుకు కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచామని కలెక్టర్ వెల్లడించారు. కలెక్టర్ వెంట కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, వికాస పీడీ కె.లచ్చారావు, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంవో) డా. ఆర్.సుదర్శన్‌బాబు తదితరులు ఉన్నారు.