అంటరాని తనమే నిశ్వార్ధ సేవ వైపు నడిపింది..
Ens Balu
3
Sankhavaram
2021-05-16 11:15:48
అమ్మ ఒడే అతని బడి.. అమ్మ గోరు ముద్దలు పెడ్తూ చెప్పిన మంచి మాటలే అతని బుద్ది బలం.. అంతకు మించి పలకా బలపం పట్టింది లేదు.. తన నిజ జీవితంలో ఏ పుస్తకాలనూ చదవని అతని మస్తకం ప్రపంచాన్నిఎంతో చక్కగా చదివింది.. కళ్లముందు కదలాడిన అంటరాని తనం తనసేవకు తొలిమొట్టు అయ్యింది.. నాటి నుంచి నేటి వరకూ వెను తిరిగి చూడకుండా తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నాడా ఆటోవాలా.. ఆ మంచి మనిషికోసం తెలుసుకుంటే.. తూర్పు గోదావరి జిల్లా శంఖవరంలో ఆటో డ్రైవర్ గా జీవనాన్ని గడుపుతూ "దళిత ప్రజా ఐక్య వేదిక సేవా సంఘం శంఖవరం" సభ్యునిగా తన ప్రాంత స్వజనులకు ఇతోధిక సేవలందిస్తున్న బూర్తి దుర్గాప్రసాద్ (9030117096)కు భారత రత్న డాక్టర్ భీమారావ్ రామ్ జీ అంబేద్కర్ " పే బ్యాక్ టు సొసైటీ " సిద్దాంతం బాగా వంట బట్టింది.. శంఖవరంలోని తన నివాసిత ప్రాంతమైన అంబేద్కర్ నగర్ పరిధిలోని ఏ గర్భిణీ మహిళనైనా సమయానుకూలతలతో సంబంధం లేకుండా తన ఆటోలో ఆస్పత్రులకు ఉచితంగా తరలించి, వెనుకకు తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చి తన ఉదారతను చాటు కుంటున్నాడు. శంఖవరంలోని అంబేద్కర్ నగర్ నుంచి శంఖవరం, రౌతులపూడి, కత్తిపూడి, తుని, పిఠాపురం, కాకినాడలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఉచితంగా గర్భిణీ స్త్రీలను తరలిస్తూ ఇప్పటికి నెల రోజులుగా ఉచిత సేవలను అందిస్తూ అభినందనలను అందుకున్నాడు. కరోనా వైరస్ తన విశ్వరూపం చూపిస్తున్న సమయంలో కూడా తన ఈ ఉచిత సేవలు పొందగోరే వారి కోసం తన ఆటోపై ప్లెక్సీని ప్రదర్శించి మరీ సేవలు చేస్తున్నాడు.. ఇదే విషయమై దుర్గాప్రసాద్ ను కదిలించినపుడు తన హృదయాన్ని కదిలించిన ఓ సంఘటనను వివరించాడు. నాతవరం మండలంలోని ఓ కుగ్రామంలో ఓ దళిత గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఉన్నత సామాజిక వర్గాల ఆటో వాలాలు అంగీకరించలేదని అన్నారు. అ సమయంలో గత్యంతరం లేక ఆ గర్భిణీ పశువుల పాకలో నాలుగు చీర పరదాల మాటున ఓ అభినవ బిడ్డకు జన్మనిచ్చిన సంఘటనను స్వయంగా చూసిన తనను ఎంతగానో కలచివేసిందన్నాడు.. నాడు ఆ తల్లి ఆ పశువులశాలో పడ్డ ప్రసవ క(న)ష్టం తన దళితవాడలోని ఏ గర్భిణీకి రాకూడదనే స్థిర నిర్ణయంతో తాను ఈ సేవ చేయడానికి ముందుకి వచ్చానని చెప్పుకొచ్చాడు. 73ఏళ్ల స్వతంత్ర్య భారతదేశంలో ఇంకా అంటరాతి తనం ఉండటం కడు శోచనీయమని, మనుషులంతా ఒక్కటే నని అంతా భావించాలని కోరుతున్నాడు. సబ్ కా మాలిక్ ఏక్ హై..అని అంతా అనే రోజు రావాలని, అంభేత్కర్ కలలుగన్న భారత దేశాన్ని చూడాలని అనుకుంటున్నానని చెప్పాడు కళ్లు చమర్చుతూ..!