అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజల పాట్లు..
Ens Balu
3
Kakinada
2021-05-17 02:44:14
తూర్పుగోదావరి జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు చాలా ఎక్కువగా అమలవుతున్నాయి. రాత్రి సమయంలో పూర్తిగా విద్యుత్ నిలుపుదల చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. జిల్లాలో చాలా మండలాల్లో అరకొరగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. కరోనా కర్ఫ్యూ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్న వేళ విద్యుత్ కోతలు ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలు ఉన్న ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం లేదు. పూర్తిగా లోఓల్టేజి సమస్య తలెత్తు తుంది. దీనితో మంచినీటిమోటార్లు, విద్యుత్ బల్బులు, టీవీలు కాలిపోతున్నాయి. అదే సమయంలో విద్యుత్ బిల్లులు చాలా అధికంగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోఓల్టేజీ సమస్యపై అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీనితో ఓ పక్క అప్రకటిత విద్యుత్ కోతలు, మరోపక్క లోఓల్టేజి సమస్యతో జిల్లా వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలోనైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.