కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో సామాజిక బాధ్యతతో కార్పొరేట్, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహాయం చేసేందుకు ముందుకు వస్తుండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో విపత్తును ఎదుర్కోవడంలో మరిన్ని సంస్థలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ గ్రీన్‌కో ఆధ్వర్యంలోని గ్రీన్‌కో ఫౌండేషన్ ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డికి దాదాపు రూ.15 లక్షల విలువైన 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఎనిమిది ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విపత్తు సమయంలో తమ వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన గ్రీన్‌కో ఫౌండేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉపయోగపడతాయని, అత్యవసర వైద్య సేవల్లో వీటి పాత్ర కీలకమని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ బాధితులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన గ్రీన్‌కో ఫౌండేషన్‌కు జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి అభినందనలు తెలియజేశారు.
కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌కో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన చలమలశెట్టి అనిల్‌కుమార్ జిల్లా వాసి అని, ప్రస్తుత కోవిడ్ విపత్తు సమయంలో జిల్లా ప్రజలకు ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లను అందించారని తెలిపారు. ఇంకా సహాయం ఏదైనా కావాలంటే అందించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రీన్‌కో ఫౌండేషన్ సిద్ధంగా ఉందని, జిల్లా ప్రజల తరఫున సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. రెండో వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో గ్రీన్‌కో డైరెక్టర్లు తోట శ్రీధర్, తుమ్మల మోహన్ తదితరులు పాల్గొన్నారు.