కరోనా సమయంలో దాతలు చేసే సహాయం కోవిడ్ రోగుల ప్రాణాలకు భరోసా కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డి.మురళీ ధరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ ను కలిసి డార్విన్ ఫార్మా (విజయవాడ) సంస్థ ప్రతినిధి ఎస్‌సీవీ రత్నారెడ్డి.. అయిదు స్ట్రాటస్ ఫైవ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. కోవిడ్ బాధితులకు అవసరమైన ప్రాణ వాయువును అందించేందుకు ఉపయోగపడే 10 ఎల్‌పీఎం సామర్థంగల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ చేశారు. డార్విన్ ఫార్మాకు కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కోవిడ్ విపత్తు సమయంలో బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో డార్విన్ ఫార్మాకు చెందిన డా. వి.రవికుమార్, డా. ఎన్.మురళిలు యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండేషన్, వెస్ట్ టెక్సాస్ ఇండియన్ డాక్టర్స్ గ్రూప్ సహకారంతో ఒక్కోటి రూ.లక్షా పదివేలు విలువైన అయిదు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించినట్లు రత్నారెడ్డి తెలిపారు. రెండు వెంటిలేటర్లను కూడా సమకూర్చినట్లు వెల్లడించారు. కోవిడ్ బాధితులకు ఉపయోగపడే స్ట్రాటస్ ఫైవ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన డార్విన్ ఫార్మా సంస్థకు జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి అభినందనలు తెలియజేశారు.