రైతులూ దళారులను నమ్మి మోసపోవద్దు..


Ens Balu
1
Kakinada
2021-05-17 13:15:28

రైతులు రబీ సీజనలో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, రైతు భరోసా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాలను సంప్రతించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పొందాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ కోరారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల రబీ ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చేపట్టిన చర్యలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని తక్కవ ధరలకు దళారులు అమ్మి నష్టపోకుండా మద్దతు ధర పొందేందుకు జిల్లా వ్యాప్తంగా 885 రైతు భరోసా కేంద్రాలు, 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.  2020-21 రబీ సీజనుకు రైతులు పండించిన  ఏ గ్రేడు ధాన్యానికి క్వింటాలుకు 1888 రూపాయలు (75 కేజీల బస్తాకు 1416 రూపాయలు), సాధారణ రకానికి క్వింటాలుకు 1868 రూపాయలు ( 75 కేజీల బస్తాకు 1401 రూపాయలు) చొప్పున ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకూ 355 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 2 లక్షల 14 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలోని 885 రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచామని, రైతులు తమ ధాన్యంలో తేమ శాతాన్ని సమీప ఆర్ బి కే లలో ఉచితంగా తెలుసుకోవచ్చనన్నారు.  తమధాన్యానికి  17 శాతం లోపు తేమ, 3 శాతం లోపు వ్యర్థాలు ఉండేలా చూసుకుని, ఆర్ బి కె లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రతించి కూపన్లు పొంది, 24 గంటలలో మద్దతు ధరకు విక్రయించుకోవచ్చనని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, విఆర్ఓలు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, పిపిసి కేంద్రాల సిబ్బంది రైతులకు మద్దతు ధరలు గురించి వివరించి, దళారుల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారన్నారు.  జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కప్పి కాపాడుకోవాలని, దళారుల మాటలు నమ్మి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆయన తెలిపారు.  ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో 8886613611 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.  ప్రభుత్వ కనీస మద్దతు ధర పొందడంలో దళారులు, ఇతరుల నుండి సమస్యలు వస్తే ఈ కంట్రోల్ రూమ్ నెంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ రైతులకు తెలియజేశారు. 
సిఫార్సు