క‌లెక్ట‌ర్‌గా మూడేళ్ల ప‌ద‌వీకాలనికి ప్రశంసలు..


Ens Balu
2
Vizianagaram
2021-05-17 13:36:31

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ గొప్ప పాల‌నాద‌క్షులే కాకుండా, ఉన్న‌త వ్య‌క్తిత్వం క‌ల‌వార‌ని ప‌లువురు అధికారులు కొనియాడారు. ఆయ‌న నాయ‌క‌త్వ ప‌ఠిమ కార‌ణంగా జిల్లా ఖ్యాతి ఇనుమ‌డించింద‌ని, ప‌లు జాతీయ‌, రాష్ట్ర‌స్థాయి అవార్డులు వ‌రించాయ‌ని ప్ర‌శంసించారు. జిల్లా క‌లెక్ట‌ర్ గా మూడేళ్ల ప‌ద‌వీకాలం పూర్త‌యిన సంద‌ర్భంగా, ప‌లువురు ఉన్న‌తాధికారులు, జిల్లా అధికారులు, నాయ‌కులు, సోమ‌వారం ఏర్పాటు చేసిన జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో క‌లెక్ట‌ర్‌ను అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.
           జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఈ మూడేళ్లూ అంద‌రినీ క‌లుపుకొని, జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపార‌ని అన్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో సైతం జిల్లా పేరు మారుమ్రోగిందంటే, దానికి క‌లెక్ట‌ర్ కృషే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాపై ఆయ‌న చెర‌గ‌ని ముద్ర వేశార‌ని, జిల్లా చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆయ‌న మాట‌తీరు, న‌డ‌వ‌డిక‌, వ్య‌వ‌హార శైలి, మృదు స్వ‌భావం త‌మ‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ హ‌యాంలో ప‌నిచేయ‌డం త‌మ అధృష్ట‌మ‌ని ప‌లువురు అధికారులు పేర్కొన్నారు. ప‌నులు ఎలా పూర్తి చేయాలో, ప్ర‌ణాళిక‌ల‌ను ఎలా త‌యారు చేయాలో, తాము క‌లెక్ట‌ర్‌ను చూసి నేర్చుకున్నామ‌న్నారు. చెర‌గ‌ని చిరున‌వ్వుతో, క‌లుపుగోలుత‌నంతో, ఎనాడూ ఎవ‌రికీ ఎటువంటి హానీ చేయ‌ని గొప్ప సంస్కారం క‌లెక్ట‌ర్ సొంత‌మ‌ని కొనియాడారు.
         జాయింట్ క‌లెక్ట‌ర్‌(రెవెన్యూ) డాక్ట‌ర్ జిసి కిశోర్ కుమార్‌, జాయింట్ క‌లెక్ట‌ర్(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ ఆర్‌.కూర్మ‌నాధ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, తాశీల్దార్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల అధికారులు, ఉద్యోగ సంఘాల నాయ‌కులు,  క‌లెక్ట‌ర్ కు జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో అభినందన‌లు తెలిపారు.

స‌మిష్టి కృషే విజ‌యాల‌కు కార‌ణం ః డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జిల్లా క‌లెక్ట‌ర్‌
         జిల్లా క‌లెక్ట‌ర్‌గా తాను సాధించిన విజ‌యాల‌కు స‌మిష్టి కృషి, ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కార‌మే కార‌ణ‌మ‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. మూడేళ్ల‌పాటు క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించే అరుదైన‌ అవ‌కాశాన్ని త‌న‌కు ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మూడేళ్ల‌లో సాధించిన విజ‌యాల‌ను మ‌రోసారి గుర్తుకు తెచ్చుకున్నారు. వివిధ ర‌కాల ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించామ‌ని, ప్ర‌కృతి విప‌త్తుల‌ను ఎదుర్కొన్నామ‌ని, క‌రోనాను మొద‌టి ద‌శ‌లో విజ‌య‌వంతంగా క‌ట్ట‌డి చేశామ‌ని చెప్పారు. ప్ర‌స్తుత రెండోద‌శ‌ను కూడా ఇదే ప‌ద్ద‌తిలో నియంత్రించి, జూన్ 17 నాటికి పూర్తిగా అదుపు చేయాల‌న్న ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని చెప్పారు.
         ఒక్కోసారి మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డినా, నింద‌లు, అప‌వాదులు వ‌స్తుంటాయ‌ని, వాటికి కృంగిపోకుండా, లోపాల‌ను అధిగ‌మించి, ముందుకు పోవాల‌ని కోరారు. సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళ్లాల‌ని సూచించారు. త‌న కుటుంబ నేప‌థ్యం, వైద్య విద్య‌, ఇంత‌కుముందు చేసిన ఉద్యోగాల అనుభ‌వాన్ని దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జ‌రిగింద‌న్నారు. శ‌తాయుష్షుకు విజ‌య‌న‌గ‌రం జిల్లా చిరునామాగా మారాల‌ని, దానికోసం ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం, ప‌రిపూర్ణ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.
సిఫార్సు