ప్ర‌జల స‌హ‌కారంతోనే కోవిడ్ నియంత్ర‌ణ‌..


Ens Balu
1
Vizianagaram
2021-05-17 13:38:13

ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే కోవిడ్‌ను నియంత్రించ‌గ‌ల‌మని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ స్ప‌ష్టం చేశారు. ఈ మ‌హ‌మ్మారిని జిల్లా నుంచి త‌రిమికొట్ట‌డంలో, మున్సిప‌ల్ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌వంతు పాత్ర పోషించాల‌ని కోరారు. ప‌ట్ట‌ణాల అభివృద్దికి పంచ‌సూత్రాల‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. మేయ‌ర్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, వైస్ ఛైర్మ‌న్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లెక్ట‌ర్ సోమ‌వారం టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.    ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాలో క‌రోనా నియంత్ర‌ణ‌కు నివార‌ణ‌, చికిత్స‌, కార్యాచ‌ర‌ణ అనే మూడంచెల వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. కోవిడ్ నివార‌ణకు ప్ర‌తీఒక్క‌రూ మాస్కుల‌ను ధ‌రించ‌డం, భౌతిక దూరాన్ని పాటించ‌డం, త‌ర‌చూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం అనే అంశాల‌ని ప్ర‌తీఒక్క‌రూ పాటించాల‌ని కోరారు. మ‌రోవైపు వేక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు. వ్యాధి సోకిన‌వారికి అత్యుత్త‌మ చికిత్స‌ను అందించ‌డం ద్వారా న‌యం చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్న‌వారిని హోం ఐసోలేష‌న్‌లో ఉంచి, వారికి కోవిడ్ కిట్ల‌ను అంద‌జేసి చికిత్స‌ను అందించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇళ్ల‌లో ఏకాంతంగా ఉండే అవ‌కాశం లేనివారిని కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌కు పంపించి చికిత్స చేస్తున్నామ‌న్నారు. అవ‌స‌ర‌మైన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి, చికిత్స చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. వ్యాధిని ముందే గుర్తించేందుకు వీలుగా, ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే జ‌రుగుతోంద‌ని, ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను కూడా చేస్తున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో వ్యాధి నియంత్ర‌ణ‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిలో కూడా కొంత‌మంది బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాస్కుల‌ను పెట్టుకోక‌పోవ‌డం, మార్కెట్ల‌లో, షాపుల‌వ‌ద్దా భౌతిక దూరాన్ని పాటించ‌క‌పోవ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను నివారించేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని సూచించారు.

             మున్సిప‌ల్ ప్రాంతాల అభివృద్దికి క‌లెక్ట‌ర్ పంచ‌సూత్రాల‌ను ప్ర‌క‌టించారు. టిఏటిఏఎస్ (టేంక్స్ క్లీనింగ్‌, ఎమిలిటీస్‌, ట్రీ ప్లాంటేష‌న్, అవేర్‌నెస్‌, శానిటేష‌న్) ఈ ఐదూ ప‌ట్ట‌ణాల అభివృద్దికి కీల‌క‌మ‌న్నారు. వ‌ర్షాలు ప్రారంభం కాక‌ముందే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని చెరువుల‌ను శుద్ది చేయాల‌ని, పేరుకుపోయిన చెత్తా, పూడిక‌, ప్లాస్టిక్ తొల‌గించాల‌ని, చెరువులోకి వ‌ర్ష‌పునీరు వెళ్లేవిధంగా కాలువ‌లు సిద్దం చేయాల‌ని, గ‌ట్ల‌ను ప‌టిష్టం చేసి, మొక్క‌ల‌ను నాటేందుకు అనువుగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణాల్లో త్రాగునీరు, రోడ్లు, కాలువ‌లు, వీధి దీపాలు త‌దిత‌ర మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. ట్రీ ప్లాంటేష‌న్‌లో భాగంగా, అవ‌కాశం ఉన్న ప్ర‌తీ ప్రాంతంలో మొక్క‌ల‌ను నాటాల‌ని, ప‌రిశ‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల విధులు, బాధ్య‌త‌లు, ప‌రిశ‌రాల ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నం ప్రాధాన్య‌త‌ల‌ను వివ‌రిస్తూ బోర్డుల‌ను ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. పారిశుధ్యానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త‌నివ్వాల‌ని, రానున్న వ‌ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

               విజ‌య‌న‌గ‌రం నుంచి కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి, పార్వ‌తీపురం మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ బోని గౌరీశ్వ‌రి, నెల్లిమ‌ర్ల నుంచి కౌన్సిల‌ర్ సంధ్య క‌లెక్ట‌ర్‌తో మాట్లాడి, ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.  ఈ టెలీకాన్ఫ‌రెన్స్‌లో విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, ఇత‌ర మున్సిపాల్టీల క‌మిష‌నర్లు, మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, ఛైర్‌ప‌ర్స‌న్లు, వైఎస్ ఛైర్మ‌న్లు, కార్పొరేటర్లు, కౌన్సిల‌ర్లు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు.
సిఫార్సు