జాబితాలో ఉంటేనే కోవిడ్ వేక్సిన్..


Ens Balu
2
Srikakulam
2021-05-17 13:40:47

జాబితాలో ఉన్న వారికే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టడం జరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో వ్యాక్సిన్ కు ఏ వ్యక్తులు రావాలి అని ముందుగానే సమాచారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా సమాచారం అందించిన వ్యక్తులు మాత్రమే వ్యాక్సినేషన్ కు రావాలని, వారి జాబితా మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జాబితాలో లేని వారికి ఆ రోజు వాక్సినేషన్ వేయడం జరగదని తెలిపారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని గుర్తించాలని అయితే వారికి ఇచ్చిన తేదీలలో మాత్రమే వాక్సినేషన్ జరుగుతుందని, ఆ రోజున రావాలని  కలెక్టర్ చెప్పారు.  ఫీవర్ సర్వే, కరోనా లక్షణాలతో ఉన్న వారిని గూర్చి మాట్లాడుతూ ఫీవర్ సర్వే పక్క జరగాలని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని తక్షణం గుర్తించి వారి నమూనాలు సేకరించాలని ఆయన ఆదేశించారు. ఇంటివద్ద ఐసోలేషన్ సౌకర్యాలు లేని వారు కోవిడ్ కేర్ కేంద్రాల్లో వచ్చి ఉండవచ్చని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో మంచి వైద్య సేవలు, వసతి సౌకర్యం, భోజన సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాత్రునివలస, సంతబొమ్మాలి కేంద్రాల్లో అనేక బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇంటి వద్ద ఉంటూ మందులు సకాలంలో తీసుకోక పోవడం వలన వ్యాధి తీవ్రత పెంచుకుంటున్నారని, అటువంటి అవకాశం వారికి ఇవ్వకుండా వారిని కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. మండలాల్లో ఎక్కువ నమూనాలు తీయాలని ఆయన ఆదేశించారు.  గత 15 రోజులుగా ఏ ప్రాంతం నుండి తక్కువ నమూనాలు సేకరించినది గుర్తించాలని, అటువంటి మండల సర్వేలియన్స్ అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నమూనాలు తీసిన వెంటనే వాటిని పరీక్షలకు పంపించాలని, అందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. 24 గంటల లోపుగా ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. 
      ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే .శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడ, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి వి ఎస్ జి కుమార్, ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు