ఆక్సిజన్ సరఫరాను పటిష్టం చేయాలి..
Ens Balu
1
Kakinada
2021-05-17 14:09:27
తూర్పు నేవల్ డాక్‌యార్డ్ (విశాఖపట్నం) లెఫ్టినెంట్ కమాండర్ సాహిల్ త్యాగి సోమవారం సాయంత్రం కాకినాడలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని కలిశారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను మరింత పటిష్టం చేసేందుకు పలు సూచనలు అందించారు. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, జీఎస్ఎల్ ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్‌లు, వాటి నుంచి పైపుల ద్వారా సరఫరా ప్రక్రియల ప్రత్యక్ష పరిశీలన ఆధారంగా సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్‌ల పటిష్టతకు సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. మెడికల్ ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవస్థలో సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పైప్‌లైన్ వ్యవస్థ భద్రత తదితర అంశాలపై కలెక్టర్, లెఫ్టినెంట్ కమాండర్ చర్చించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు అవసరం మేరకు మెడికల్ ఆక్సిజన్‌ను అందించే ప్రక్రియ మొత్తం బాగున్నప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు జరక్కుండా ఉండేందుకు అమలుచేయాల్సిన ప్రణాళికపై ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) ఈఈ కె.సీతారామరాజు పాల్గొన్నారు.