ఇసుక సరఫరా అందుబాటులో ఉంచాలి..
Ens Balu
2
Kakinada
2021-05-17 14:52:28
తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర విభాగాలను సమన్వయం చేసుకుంటూ కొత్త ఇసుక విధాన పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి విజయవాడ నుంచి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది.. ఇసుక విధానం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పీలు, జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ మైనింగ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరా సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రీచ్‌ల సామర్థ్యం మేరకు మైనింగ్ జరిగి, వినియోగదారులకు సక్రమంగా ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి లావాదేవీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగేలా చూస్తామన్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలకు తావులేకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)తో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో జిల్లాలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన ముగ్గురు కాంట్రాక్టర్లు, ఓ ఏజెన్సీకి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఇసుక పర్యవేక్షణ కమిటీ దాదాపు రూ.22 కోట్ల మేర జరిమానా విధించిన అంశాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు వీసీ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి చర్యలు విధానాల పటిష్ట అమలుకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.