విధుల్లో నిర్లక్ష్యం శ్రీకాకుళంలో 19 వాలంటీర్లు తొలగింపు


Ens Balu
4
Srikakulam
2020-08-27 20:21:24

శ్రీకాకుళం జిల్లాలోని  కోవిడ్ విధులలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సోంపేట పరిధిలోని 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగిస్తున్నట్లు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు.  ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. ప్రతి వాలంటీరుకు కోవిడ్ లో నిర్వహించాల్సిన విధులను స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి వాలంటీరు తన పరిధిలోని 50 గృహాలను ప్రతి రోజు విధిగా సందర్శించి  ఏ ఇంటిలోనైనా కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణం తెలియజేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కాని సోంపేట సచివాలయం – 1 లో 52 మంది వాలంటీర్లకు గాను   15 మంది గైర్హజరు అయ్యారని, అదేవిధంగా సోంపేట సచివాలయం – 2 లో 28 మంది వాలంటీర్లకు గాను 4 గురు గైర్హజరు అయినట్లు మండల తహశీల్ధారు రిపోర్టు చేసినట్లు ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా 19 మంది వాలంటీర్లను విధుల నుండి తొలగించామని జాయింట్ కలెక్టర్ వివరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.