కరోనా మహమ్మారి నుంచి కోవిడ్ బాధితులు పుర్తిగా కొలుకునేలా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహాయం కావాలన్నా అందించేలా చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అవసరమైతే వ్యక్తిగతంగా ఎలాంటి సాయం చేయడానికైనా తాను కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. జిల్లాలో కోవిడ్ బాధితులకు చికిత్సలో కీలకంగా ఉన్న ఒంగోలు రిమ్స్ వైద్యులు, అధికారులతో ఆదివారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి చికిత్స అందుతున్న తీరు, ఈ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులు చర్చించి, డాక్టర్ల అభిప్రాయాలు, సూచనలను ఆయన తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులు వైద్యులను దేవుళ్లుగా భావిస్తున్నారని, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా మరింత సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని డాక్టర్లకు సూచించారు. రిమ్స్ కు వస్తున్న వాళ్ళు పేదవారు కనుక వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులతోపాటు అధికార యంత్రాంగం అందరిపైనా ఉందన్నారు. ఈ రెండు నెలలు తాను ఇక్కడే ఉంటానని, సహాయం కోసం వచ్చే కోవిడ్ బాధితులకు అందుబాటులో ఉంటానని, ఈ విషయంలో శక్తి మేరకు కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్లకు కూడా తాను అండగా ఉంటానని, డాక్టర్లు కూడా రోగులకు అండగా ఉండి చికిత్స అందించాలని ఆయన సూచించారు.
రిమ్స్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ వల్ల బెడ్స్ కోసం ఎక్కువసేపు వేచిచూడాల్సిన పరిస్థితి తొలగిందని వైద్యులు చెప్పారని, అలాగే ప్రతి పీహెచ్సీలో కూడా బెడ్లు పెంచితే రిమ్స్ పై ఒత్తిడి తగ్గుతుందని వైద్యులు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటున్నానని మంత్రి చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, పీహెచ్సీల్లో బెడ్లు పెంచేలా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. కోవిడ్ బాధితులు పెరుగుతున్నందున మెడికల్ స్టాఫ్ ను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా ఆయన మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా సర్వీసులోకి రావడానికి భయపడుతున్నారని, అవసరమైతే ఎక్కువ జీతం ఇచ్చే విషయాన్ని కూడా ఆలోచించాలని జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి)కు సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో బాధితులకు చికిత్స చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
రిమ్స్ లో హెడ్ నర్సుగా పని చేస్తూ కరోనా వల్ల మృతి చెందిన రోజ్ మేరీ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.2లక్షల పరిహారాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. కరోనాతో మరణించిన ఇతర వైద్యుల కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ బాధితులకు సేవ చేస్తున్నారని వైద్యులను మంత్రి అభినందించారు. సర్వీసు చేయడానికి మెడికల్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వస్తే వారికి పేమెంట్ కూడా ఇస్తామని మంత్రి చెప్పారు. డాక్టర్లకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రేమిడిసివర్ మందు తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.
జాయింట్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ (సచివాలయాలు మరియు అభివృద్ధి) మాట్లాడుతూ రిమ్స్ తో పాటు కోవిడ్ కేర్ సెంటర్లలో అందుతున్న సేవలు, ఈ దిశగా చేపట్టిన చర్యలు, పేషేంట్ ఆడిటింగ్, ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతున్న తీరును వివరించారు. రిమ్స్ కు నోడల్ ఆఫీసరుగా ఉన్న జాయింట్ కలెక్టర్ కృష్ణ వేణి (ఆసరా మరియు సంక్షేమం) మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యంతో పాటు మానసిక ధైర్యం కూడా కల్పించాలని వైద్యులకు సూచించారు. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ ఒంగోలును కరోనా రహిత నగరంగా మార్చేలా కృషి చేయాలని వైద్యులను కోరారు.
ఈ సమావేశంలో ముందుగా కోవిడ్ తో మరణించిన ముగ్గురు వైద్య సిబ్బందికి సంతాపంగా మూడు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ మురళీకృష్ణారెడ్డి, ఆర్.ఎమ్.వో. వేణుగోపాల్ రెడ్డి, డీఎంహెచ్వో రత్నావళి, పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం పి.వి.ఆర్. బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కోవిడ్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.