విజయనగరంజిల్లాలో మరో 200 వరకూ ఆక్సీజన్ పడకలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆక్సీజన్ పడకలకు సుమారుగా 8.7 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ అవసరం ఉందని, వాడకానికి సరిపడినంత ఆక్సీజన్ సరఫరా జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 700 ఆక్సీజన్ పడకలు ఉన్నాయని, వీటిలో జిల్లా కేంద్రాసుపత్రిలోనే సుమారు 200 పడకలు ఉన్నాయని చెప్పారు. వీటిలో చాలా వాటికి పైప్‌లైన్ల ద్వారా లిక్విడ్ ఆక్సీజన్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇంతకుముందు జిల్లా కేంద్రాసుపత్రిలో ఒక కిలోలీటర్ సామర్ధ్యమున్న రెండు ఆక్సీజన్ ట్యాంకులు ఉండేవని, కొత్తగా 10 కెఎల్ కెపాసిటీ ట్యాంకును ఇటీవలే ప్రారంభించామని చెప్పారు. ఈ ట్యాంకును ఒకసారి నింపితే, సుమారు 48 గంటలపాటు సరిపడుతుందన్నారు. అందువల్ల ఈ ట్యాంకును రోజు విడిచి రోజు నింపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లాలో సుమారు 70శాతం ఆక్సీజన్ సరఫరా డి టైప్ సిలండర్ల మీదనే ఆధారపడి ఉందన్నారు. ఒక్కో సిలండర్‌లో 7 మెట్రిక్ క్యూబిక్కుల ఆక్సీజన్ పడుతుందని, వీటి ద్వారానే దాదాపు 500 పడకలకు ఆక్సీజన్ సరఫరా జరుగుతోందని చెప్పారు. బొబ్బిలిలో ఉన్న రెండు ప్రయివేటు రీఫిల్లింగ్ కేంద్రాల ద్వారా వీటిలో ఆక్సీజన్‌ను నింపుతున్నామని చెప్పారు. రోజుకు 450 నుంచి 500 సిలండర్లు వీటిలో రీఫిల్లింగ్ జరుగుతోందన్నారు. జిల్లాలో జాడ తెలియకుండా పోయిన సుమారు 250 సిలండర్లను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మిమ్స్‌లో దాదాపు వంద వరకూ సిలండర్ మేనిఫోల్డ్స్ వృధాగా పడిఉన్నాయని, నేవీ సహకారంతో వాటిని పునర్ వినియోగించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒక్కో మేనిఫోల్డ్ ద్వారా నాలుగైదు పడకలకు ఆక్సీజన్‌ను సరఫరా చేయవచ్చని చెప్పారు. వీటితోపాటు, మరికొన్ని డి టైప్ సిలండర్లు కూడా అందుబాటులోకి వస్తే, జెర్మన్ హేంగర్ విధానంలో షెడ్స్ వేసి, అదనంగా దాదాపు 200 ఆక్సీజన్ పడకలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని జెసి మహేష్ వివరించారు.