బుడగట్ల పాలెంలో ఫిష్షింగ్ హార్బర్..
Ens Balu
4
Srikakulam
2021-05-18 10:38:06
మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఈ ఏడాదే ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్ పనులు మొదలు పెడతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వేట నిషేధంతో ఉపాధి కోల్పోతున్న గంగపుత్రులకు భృతి కల్పించేందుకు మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 వేలు సీఎం జగన్ అమరావతి నుంచి ప్రారంభించిన కార్యక్రమానికి ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ మత్స్యకార భరోసా పథకం కింద వారి ఖాతాల్లోనే సొమ్ములు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఒకవైపు కరోనా, మరోవైపు వేట నిషేధంతో ఇళ్లకే పరిమితమైన మత్స్య కారులకు ప్రభుత్వసాయం ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. జిల్లాలో 11 తీర ప్రాంత మండలాలలోని 16630 మంది గంగపుత్రులకు రూ.16కోట్ల 63 లక్షలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 193 కి. మీ. మేర సువిశాల తీరప్రాంతం ఉందని వేలాది మంది వేట పైనే ఆధారపడి జీవిస్తున్నారని, మత్స్యకారులు సొంతగా పడవలు సమ కూర్చుకుంటే వారికి ప్రయోజనం సమకూరుతుందని వివరించారు. వజ్రపుకొత్తూరు లో జెట్టీ నిర్మాణం త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. భవనపడులో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు వివరించారు. పశ్చిమ గోదావరిలో మత్స్యకార యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జె నివాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఫిషరీస్ జె.డి టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.