రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ మత్స్యకార భరోసా మూడో ఏడాది ఆర్ధిక సహాయ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు మత్స్యకారులకు వేట నిషేధ కాలమని, ఆ సమయంలో ప్రతి ఏటా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.119.88 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు గతంలో కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మర పడవలు, యాంత్రిక పడవలతో పాటు సముద్రంలో సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకారులకు భృతి చెల్లిస్తున్నట్లు ఆయన వివరించారు. 2019 నుండి ఇప్పటి వరకు రూ. 332 కోట్లను భరోసాగా అందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. డీజిల్ ఆయిల్ పై లీటర్ కు సబ్సిడీ రూ.6.03 నుండి రూ.9 పెంచుతూ, ఆయిల్ పోయించుకుని సమయంలోనే రేటు తగ్గించి పోసే ఏర్పాటు చేశామని చెప్పారు. వేట చేస్తూ మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపుదల చేసినట్లు ఆయన చెప్పారు. దాదాపు రూ.1,510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, రెండో దశలో శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖజిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో రూ.1365.35 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ హార్బర్ల ద్వారా దాదాపు 85 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది రూ.780 కోట్ల వ్యయంతో 53,550 మంది ఆక్వా రైతులకు ఇప్పటివరకు రూ.1,560 కోట్లతో లబ్ది కలిగేలా యూనిట్ కరెంటు కేవలం రూ.1.50 లకే సరఫరా సిగేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.50.30 కోట్ల వ్యయంతో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్ లను ఏర్పాటుతో నాణ్యమైన ఉత్పత్తులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చి వినియోగం పెంచడం, పౌష్టికాహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి ఆక్వా రైతులకు, మత్స్యకారుల కూడా గిట్టుబాటు ధర కల్పించాలని రూ.332.9 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో ఆక్వా హబ్ లు, వాటికి అనుసంధానంగా రిటైల్ దుకాణాలు ఏర్పాటు దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 25 ఆక్వా హబ్ లకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. 2019 నుండి ఇప్పటివరకు మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.2030.87 కోట్ల రూపాయలను 2,12,535 మంది లబ్ధిదారులకు ఆర్ధిక సహాయంగా అందించడం జరిగిందని ఆయన చెప్పారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్ అప్లికేషన్ eMatsyakar ప్రారంభించామని, సహాయం, ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 155251 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో 4,698 అర్హమైన బోట్లకు సంబంధించి 16,630 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా క్రింద లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందులో భాగంగా రణస్థలం మండలంలో 801 బొట్లకు సంబంధించి 2424 మంది, ఎచ్చెర్ల మండలంలో 537 బోట్లు, 1937 మంది లబ్ధిదారులు., శ్రీకాకుళంలో 339 బోట్లు, 1074 మంది., గారలో 551 బోట్లు, 2054 మంది., పొలాకిలో 375 బోట్లు, 1504 మంది., సంతబొమ్మాలిలో 323 బోట్లు 1310 మంది., మందస మండలంలో 67 బోట్లు 230 మంది., వజ్రపుకొత్తూరులో 515 బోట్లు 1881 మంది., సోంపేటలో 434 బోట్లు 1610 మంది, కవిటి లో 638 బోట్లు 2163 మంది, ఇచ్చాపురంలో 118 బోట్లు 443 మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మందస మండలం నేల గంగువాడకు చెందిన పొట్టి ధర్మారావు మాట్లాడుతూ వివిధ పథకాల క్రింద ఆర్ధిక సహాయం అందిందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి లాంఛనంగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి.వి. శ్రీనివాసరావు, మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు కోనాడ నర్సింగరావు, నెయ్యిల సంఘ ప్రెసిడెంట్ పాండ్రంకి మురళీకృష్ణ, మత్స్యకార నాయకులు మైలపల్లి పోలీస్ తదితరులు పాల్గొన్నారు.