విజయనగరం జిల్లాలో మత్స్యకార భరోసా పథకంలో భాగంగా జిల్లాలో 2953 కుటుంబాలకు రూ.2.953 కోట్ల ఆర్థిక సాయం వారి ఖాతాల్లో జమ అయ్యింది. వేట నిషేధకాలంలో మత్స్యకారుల సంక్షేమార్థం ప్రవేశపెట్టిన ఈ పథకం మూడో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మీట నొక్కడం ద్వారా విడుదల చేశారు. వరుసగా మూడో ఏడాది అనగా 2021-22 కాలానికి గాను ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున రైతుల ఖాతాలకు జమ చేశారు. రాష్ట్రంలో మత్స్యకార సోదరుల సంక్షేమార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు, లబ్ధిదారుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం నుంచి పలువురు లబ్ధిదారులు మాట్లాడిన తర్వాత సంబంధిత చెక్కును ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన చెక్కును ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్, జేసీ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీ కిశోర్ కుమార్, మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలాకుమారి, జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ బర్రె చినప్పన్న, మత్స్యకార నాయకులు మైలపల్లి నర్శింహులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.