తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మార్గనిర్దేశనం మేరకు జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక వ్యవస్థ ద్వారా 104 కాల్స్‌కు త్వరితగతిన పరిష్కారం లభిస్తోందని, బ్యాక్‌లాగ్ కాల్స్ అనే మాటకు తావులేకుండా ఈ వ్యవస్థ పనిచేస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్‌భాస్కర్, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి తదితరులతో కలిసి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్దగల బెనెడ్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన 104 కాల్‌సెంటర్ విభాగాన్ని సందర్శించారు. విభాగం పనితీరును పరిశీలించి, సిబ్బంది నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోం ఐసోలేషన్ కిట్ల రూపకల్పన పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 104 కాల్స్ పరిష్కారం కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న 40 మంది సిబ్బంది, అధికారుల బృందం మొత్తాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బాధితునికి ప్రత్యేకంగా ట్రాక్‌షీట్ రూపొందించి, నిరంతర పర్యవేక్షణ ద్వారా అవసరమైన సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ కృషిచేస్తోందన్నారు. డివిజన్ స్థాయిలోనూ కాల్‌సెంటర్లు సేవలందిస్తున్నాయన్నారు. కోవిడ్ బారినపడినవారు ఆందోళన చెందకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని, ఈ విధంగా చేస్తే త్వరగా కోలుకోవచ్చన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల అన్ని ఆసుపత్రులకు చెడ్డపేరు వస్తోందని, ప్రైవేటు ఆసుపత్రులు ఇది సంపాదనకు కాకుండా సహాయం చేయాల్సిన సమయంగా భావించి సేవలందించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట పరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు హర్షణీయంగా ఉన్నాయని, బాధితులకు సేవలందించే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వైరస్ బారినపడుతున్నారని తెలిపారు. ఒకరు చేసిన తప్పిదం వందమందిని నష్టపరుస్తుందని.. అందువల్ల ప్రజలందరూ స్వీయ క్రమశిక్షణతో జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ కట్టడిలో భాగస్వాములు కావాలని మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు.
కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కేర్ కేంద్రాల్లో (సీసీసీ)నూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుతున్నామని, ఈ ఏర్పాటు వల్ల కోవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడి బాగా తగ్గుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని సీసీసీల్లో దాదాపు 2000 మంది ఉన్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాలకూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మొబైల్ వెంటిలేటర్లు వంటివి అందిస్తున్నాయన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఔషధాలతో ప్రత్యేక కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. మందుల నాణ్యతా ప్రమాణాలు పాటించే విషయంలో మెడికల్ దుకాణాలపైనా నిఘా పెట్టామని, ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో వికాస పీడీ కె.లచ్చారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.