విజయనగరం జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. డిఆర్‌డిఏ, ఎల్‌డిఎం, ఇతర అధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యాంకుల్లో కోవిడ్ నిబంధనల అమలు, వైఎస్ఆర్ బీమా నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కర్ఫ్యూ కారణంగా బ్యాంకులు రద్దీగా ఉంటున్నాయని, అందువల్ల తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని, ప్రతీ బ్యాంకు ప్రవేశద్వారం వద్ద తప్పనిసరిగా శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్కులను ధరించిన వారిని మాత్రమే బ్యాంకుల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎటిఎంల వద్ద కూడా శానిటైజర్‌ను, టిష్యూ పేపర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బ్యాంకు పనివేళలు కుదించినందువల్ల, ప్రజలు ఇబ్బంది పడకుండా, ఏటిఎంలలో తగినంత నగదు నిల్వలు ఉండేలా చూడాలని కలెక్టర్ చెప్పారు.
వైఎస్ఆర్ బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెలాఖరు లోగా శతశాతం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. గతేడాది సుమారు 81 శాతం బీమా నమోదుతో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా తమ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున, బీమా లేనివ్యక్తులు ఎవరైనా చనిపోతే, ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరు నాటికి వైఎస్ఆర్ బీమా రెన్యువల్‌తో బాటు, కొత్తగా నమోదును కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ బ్యాంకు కార్యకలాపాలు ముగిసిన తరువాత 12 గంటలు నుంచి 2 గంటలు వరకూ, వైఎస్ఆర్ బీమా నమోదుకు కేటాయించాలన్నారు. డిఆర్‌డిఏ సిబ్బంది ఈ వేళల్లోనే బ్యాంకులకు వెళ్లి, బీమా రెన్యువల్, నమోదు పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, జిల్లాలో వైఎస్ఆర్ బీమా నమోదు, రెన్యువల్ ప్రక్రియలను ఏప్రెల్ 16 నుంచే మొదలు పెట్టామని చెప్పారు. కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరుగుతోందని, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రతీ బ్యాంకుకు ఒక డిఆర్‌డిఏ సిబ్బందిని పాయింట్ పర్సన్‌గా నియమించామన్నారు. వీరు ప్రతీరోజూ సంబంధిత సచివాలయాలకు వెల్లి, వెల్ఫేర్ అసిస్టెంట్‌వద్ద ఎన్‌రోల్‌మెంట్ జాబితాలను తీసుకొని, బ్యాంకులకు వెళ్లి ఆన్‌లైన్ చేయిస్తున్నారని చెప్పారు.
ఎల్‌డిఎం కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే బ్యాంకుల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. బీమా నమోదు కోసం ఉదయం 12 గంటలు నుంచి 2 గంటలు వరకూ సమయాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐఓబి, ఎస్‌బిఐ, గ్రామీణ బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. బ్యాంకు ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపి, 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయించడానికి ఎంతగానో సహకరించిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఎల్‌డిఎం కృతజ్ఞతలు తెలిపారు.