విజయనగరం జిల్లాలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి చిన్న విమర్శ కూడా రాకుండా సేవలందించాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులపై మరింత పర్యవేక్షణ పెంచి సేవలు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుత్రుల్లో అందుతున్న సేవలపై నిరంతరం సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు అదనపు వైద్య సిబ్బందిని త్వరతగతిన నియమించుకోవాలని సూచించారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్యం తదితర అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ జిల్లాలోని గత సమావేశంలో చర్చించిన అంశాలను, చేపట్టిన చర్యలను, జిల్లాలోని తాజా పరిస్థితిని మంత్రులకు వివరించారు. కోవిడ్ మొదటి వేవ్‌తో పోలిస్తే, ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉందని, రికవరీ రేటు కొంత తగ్గిందని చెప్పారు. జిల్లాలోని 27 ఆసుపత్రుల్లో ప్రస్తుతం కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వేలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని హౌం ఐసోలేషన్‌లో ఉంచి కోవిడ్ కిట్ల అందజేస్తున్నామని వివరించారు. గత సమావేశంలో మంత్రులు, శాసన సభ్యులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లా కేంద్రాసుపత్రిలో 10 కె.ఎల్. సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. దీనికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.20 లక్షల కేటాయించినట్లు పేర్కొన్నారు. బొబ్బిలిలో గతంలో నాలుగు పడకలకు ఆక్సిజన్ ఉండేదని.. ప్రస్తుతం పది పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామని చెప్పారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో ఉన్న 100 పడకలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టామని వివరించారు. జిల్లాకు కావాల్సిన అదనపు అంబులెన్స్‌లను, ఒక మహాప్రస్థానం వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించామన్నారు. బయో మెడికల్ ఇంజినీర్ నియామకానికి, మిమ్స్ ఆసుపత్రిలో 6 కె.ఎల్. సమార్థ్యం గల ట్యాంకర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. పరీక్షలు, టీకా ప్రక్రియ సజావుగా సాగుతోందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ 2.54 లక్షల మందికి, రెండో డోస్ 1.05 లక్షల మందికి వేశామని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ బాగుందని అన్ని వసతులు సమకూర్చామని, సేవలు బాగా అందుతున్నాయని వివరించారు.
జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ, ఆక్సీజన్ సరఫరా, వైద్యుల నియామకం, మందుల సరఫరా, ఆరోగ్య శ్రీ సేవలు, ప్రయివేటు ఆసుపత్రుల్లో అందుతున్న సేవల గురించి వివరించారు. మిమ్స్‌లో 6 కె.ఎల్. ఆక్సీజన్ ట్యాంకర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జేసీ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులకు, సీహెచ్‌సీలకు, ఏరియా ఆసుపత్రులకు అవసరమైన మందులు పక్కా అందజేస్తున్నామని వివరించారు. ఎల్.కోటలో మరో కోవిడ్ కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించగా జేసీ కిశోర్ కుమార్ స్పందిస్తూ ఆ ప్రాంతంలో ఒక సారి పర్యటించి కేంద్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడిన తర్వాత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందుతున్న కోవిడ్ సేవలపై నిఘా పెంచాలని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవలు సవ్యంగా అందుతున్నాయో లేదో సరిచూసుకోవాలని చెప్పారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రజల్లో విశ్వాసం నింపేలా తగిన విధంగా సేవలందించాలని చెప్పారు. ఆక్సీజన్, మందులు సవ్యంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కరోనాను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాలో కోవిడ్‌ను కట్టడి చేయాలని తెలిపారు. సేవలు సవ్యంగా అందేలా తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. సంబంధిత ప్రకటను జారీ చేయాలని ఆదేశించారు. బెడ్స్, రెమిడెసివర్ ఇంజక్షన్లు, ఆక్సీజన్‌ను అవసరమైన మేర అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని ఎల్.కోట, ఎస్.కోట, వేపాడ, జామి ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున అక్కడ పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. అవసరమైతే ఎల్.కోట హైస్కూల్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు బాగా అందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. మంచి భోజనం, సమయానికి మందులు అందజేయాలని ఆదేశించారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 6 కె.ఎల్. సామర్థ్యం గల ఆక్సీజన్ ట్యాంకర్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీవర్ సర్వే సరిగా జరిగేలా చూసుకోవాలని, హోం ఐసోలేషన్ కిట్ల పంపిణీ సరిగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెప్పారు. ప్రజల నుంచి చిన్న విమర్శ కూడా రాకుండా కోవిడ్ సేవలందాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవలను సమీక్షించుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం అధికారులు చేపడుతన్న చర్యలు బాగున్నాయని.. మరింత విస్తృత పరిచి కోవిడ్‌ను నియంత్రించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
సమావేశంలో భాగంగా ముందుగా పలువురు ప్రజాప్రతినిధులు పలు అంశాలపై మాట్లాడారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్ ఆసుపత్రుల్లో నియమించే అదనపు సిబ్బందిలో ఎంబీబీఎస్ వాళ్లతో పాటు, బీడీఎస్ వాళ్లను కూడా తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్.కోట పరిధిలో ఇప్పటికే మూడు ఆక్సీజన్ కాన్సలేటర్స్ ఏర్పాటు చేశామని, మరో మూడు కాన్సలేటర్స్ కావాలని కోరారు. అలాగే స్థానిక ఆసుపత్రులకు స్టెరాయిడ్స్ అందజేయాలని చెప్పారు. గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ గత వారం సమావేశం నిర్వహించి చర్చించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని, జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలు బాగున్నాయని అన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి సంబంధించి గత మీటింగ్‌లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఆర్.టి.పి.సి.ఆర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారని, అదనంగా అంబులెన్స్‌ను కేటాయించారని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, డీఎం&హెచ్‌వో రమణకుమారి, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, మహారాజ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, మిమ్స్ డైరెక్టర్ డా. భాస్కరరాజు, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.