వైద్యసిబ్బందిని వెంటనే నియమించండి..
Ens Balu
4
Collector Office
2021-05-19 13:52:47
విశాఖ జిల్లాలోని ఆసుపత్రులలో వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది నియమకాలను ప్రభుత్వ ఉతర్వులను అనుసరించి తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లాలోని కోవిడ్ నియంత్రణ, వైద్య సిబ్బంది నియామకాలు, ఆక్సిజన్ ప్రొక్యుర్ మెంట్, ఆసుపత్రులకు సరఫరా, తదితర విషయాలపై సంబంధిత అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 79 ఆసుపత్రులు వున్నాయని, వీటిలో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరాల నిమిత్తం, ఎటువంటి సమస్య తలెత్తకుండా ఆక్సిజన్ ప్రొక్యూర్ మెంట్ మరియు సరఫరా గావించాలన్నారు. ఇందుకు గాను ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీలు, వారిచే సరఫరా చేయబడుతున్న ఆక్సిజన్ వివరాలపై ఆయన చర్చించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ప్రక్క దారి పట్టకుండా వాటికి సెక్యూరిటీ వాహనాలు ఏర్పాటు గావించాలని ఉప రవాణా కమీషనర్.రాజరత్నంను ఆదేశించారు ఇందుకుగాను అవసరమైన రెవెన్యూ సిబ్బందిని విధులలో నియమించాలని ఆర్.డి.ఒ. పెంచల కిషోర్ ను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా విషయంలో ఆర్.డి.ఒ. సహకారం తీసుకోవాలని ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు రజితను ఆదేశించారు. హెల్త్ సిటీలో 48 వరకూ ఆసుపత్రులు వున్నాయని వాటికి ఆక్సిజన్ సరఫరాకు ప్రణాళికతో తగు చర్యలు చేపట్టాలన్నారు. పడకల విషయమై మాట్లాడుతూ కొన్ని ఆసుపత్రులలో పడకల పెంపుదలను పరిశీలించాలన్నారు. జర్మన్ హాంగర్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆర్.ఎండ్.బి ఎస్.ఇ. సుధాకర్ ను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి.ఆరుణ్ బాబు, ఎ.ఎం.సి ప్రిన్సిపాల్ డా. పి.వి. సుధాకర్, ఆర్.డి.ఒ. పెంచల కిషోర్, జి.యం.డి.ఐ.సి. రామలింగరాజు, ఔషధ నియంత్రణ శాఖ ఎ.డి.రజిత, ఎ.పి.ఎం .ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.నాయుడు, తదితరులు పాల్గొన్నారు.