విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవానికి ... చందనం సమర్పించిన భక్తులకు దేవస్థానం అధికారులు స్వామివారి చందన ప్రసాదాన్ని పోస్టు ద్వారా పంపిస్తున్నారు. అర కేజీ అంటే రూ. 10,116 (పదివేల నూటపదహార్లు),కేజీఅంటే రూ. 20,116(ఇరవైవేల నూటపదహార్లు) సమర్పించినవారికి ముందుగా చందనం పంపుతున్నారు. పదివేల నూటపదహార్లు పంపినవారికి చందనం ముక్క , 20వేల నూటపదహార్లు పంపినవారికి చందనం ముక్కతోపాటు శేషవస్త్రం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్యాకేజింగ్ ఆలయ ఏఈఓ రాఘవ కుమార్, కప్ప స్తంభం నాయుడు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇప్పటికీ 20,116 అంటే కేజీ చందనం సమర్పించినవారి రెండు అడ్రస్ లు పూర్తిగా తెలియరాలేదని, అందులో ఒకటి ఆఫ్రికాలోని గినియా దేశం నుంచి వచ్చిందని గుర్తించినట్టు అధికారులు తెలియజేశారు. మరొకటి చెక్ రూపేణా అడ్రస్ లేకుండా పంపించారని పేర్కొన్నారు. వీరి అడ్రస్ లు కనిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు 3 కేజీల చందనం సమర్పించారు. పలువురు భక్తులు విదేశాల నుంచి విరాళాలు పంపినా... స్వదేశీ అడ్రస్ లనే ఇచ్చారు. కాగా స్వామివారి చందన సమర్పణకు ఏడాదిలో ఎప్పుడైనా విరాళాలు పంపించే అవకాశం భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇది ఏడాది పొడవునా జరిగే ప్రక్రియని అధికారులు పేర్కొన్నారు.