ఫీవర్ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..
Ens Balu
1
Srikakulam
2021-05-19 15:34:19
శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆమదాలవలస, పోలాకి, పాతపట్నం, రేగిడి ఆమదాలవలస, రాజాం, నరసన్నపేట, సరుబుజ్జిలి, రణస్థలం తదితర 18 మండలాలు ఫీవర్ సర్వే పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నాయని తక్షణం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఫీవర్ సర్వే లో కరోనా లక్షణాలు కనిపించిన వారి నమూనాలు వెంటనే సేకరించాలని ఆయన అన్నారు. కొంత మంది వాలంటీర్లు వ్యక్తుల నమూనా సేకరించి మరల 14 రోజుల లోపు అదే వ్యక్తుల నమూనాలు సేకరిస్తున్నారని ఆయన అన్నారు. 14 రోజుల లోపు నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేస్తూ అటువంటి వాలంటీర్లను తొలగించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, కరోనా లక్షణాలు ఉన్న వారిని మాత్రమే గుర్తించి నమూనాలు సేకరించాలని ఆయన అన్నారు. కొత్తగా గుర్తించిన వ్యక్తులకు మాత్రమే నమూనాలు తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. సేకరించిన నమూనాలను వెంటనే పరీక్ష కేంద్రాలు పంపించాలని ఆయన ఆదేశించారు. మండలాలకు అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిపిఇ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు ఇప్పటికే సరఫరా చేసామని ఆయన చెప్పారు. మండలాల్లో అవసరమగు సదుపాయాల కోసం నివేదికలు సమర్పించాలని తదనుగుణంగా సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో పరిస్థితులను మండల తహశీల్దార్ లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. మండల సర్వేలియన్స్ అధికారులు పాజిటివ్ కేసులను గుర్తిస్తున్న తీరును పరిశీలించాలని, అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. పాజిటివ్ గా నిర్ధారణ చెందిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని, వారితో పాటు ప్రాథమిక కాంట్రాక్టులు కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి కుమార్ తదితరులు పాల్గొన్నారు.