గ్రామస్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ చెప్పారు. వీటి నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ తన ఛాంబర్‌లో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. కొన్నిచోట్ల గ్రామస్తులు, తాము కోవిడ్ తో బాధ పడుతున్నప్పటికీ, వివిధ కారణాలతో కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లడానికి విముఖత చూపిస్తున్నారని చెప్పారు. ఇలాంటి చోట వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వారినుంచి ఇతరులకు వ్యాధి వ్యాపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందువల్ల 25 శాతం పాజిటివిటీ ఉన్నగ్రామాల్లో, స్థానికంగానే ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమ గ్రామంలోనే ఉండటానికి గ్రామస్తులు ఎక్కువగా ఇష్టపడుతుండటం వల్ల, వారిని స్థానిక ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లేదా ఇతర ప్రభుత్వ భవనంలో 20 నుంచి 40 పడకలతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని, నిర్వహణా బాధ్యతలను మాత్రం ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుందన్నారు. దీనికోసం ఒక్కో మండలానికీ ఒక్కో స్వచ్చంద సంస్థను నోడల్ ఎన్‌జిఓగా ఎంపిక చేస్తామన్నారు.
పడకలు, మందులు, వైద్య సహాయాన్ని తామే అందిస్తామని, భోజనం, పారిశుధ్యం, నిర్వహణ మాత్రమే ఎన్‌జిఓలు చూడాల్సి ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో ఆక్సీజన్, అంబులెన్సులను కూడా పంపిస్తామన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. మండల స్థాయి అధికారులైన తాశీల్దార్లు, ఎంపిడిఓలు, వైద్యాధికారులు, స్థానికంగా గ్రామ సర్పంచ్‌లు, ఇతర ప్రభుత్వసిబ్బందిని సమన్వయం చేసుకొని, ఈ కేంద్రాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమకు అనుకూలమైన మండలాలను, ఎంపిక చేసుకొని, శుక్రవారం నాటికి జాబితాలను అందజేయాలని జెసి మహేష్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా యూత్ కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, బొబ్బిలి రోటరీ క్లబ్, నా ఊరు-విజయనగరం, స్పార్క్ సొసైటీ, మార్వాడీ యువ మంచ్, ఐఆర్‌పిడబ్ల్యూఎఫ్, క్యాంపస్ ఛాలెంజ్ తదితర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.