ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
2
Machilipatnam
2021-05-20 12:12:43

కరోనా రెండవ దశ పట్ల ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.   గురువారం ఉదయం 6 గంటల సమయంలో మంత్రి కార్యాలయంకు స్వల్ప సంఖ్యలో మాత్రమే ప్రజలు వచ్చారు. ఒక గ్రామానికి చెందిన వృద్ధురాలు తమ గ్రామంలో పలువురు కరోనా బారిన పడుతున్నారని మంత్రి పేర్ని నానికి తెలిపింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ఫ్యూ సడలించిన వేళ ప్రజలు విచ్చలవిడిగా సంచరించడం ఏమాత్రం తగదని హెచ్చరిస్తూ, కరోనా వైరస్  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో విజృంభిస్తుందనీ, నెల కిందట వరకు పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు పాకుతున్నాయని ఎంతో విచారమన్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో కూడా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయిని తెలిపారు. పల్లెల నుంచి రైతులు ప్రతిరోజు కూరగాయలు రైతుబజార్లకు తీసుకొస్తున్నారని, మరోవైపు పండ్లు అమ్మడానికి పట్టణాలకు వచ్చి వెళ్తున్నారన్నారు. పట్టణాలకు వచ్చే ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో అందులో ఒక్కరికి ఉన్నా మిగతా వారికి వ్యాపిస్తుందని వివరించారు. గ్రామాల్లో అమ్మవారి జాతరలు, పండుగ పేరుతో సామూహిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఇటువంటి చర్యల కారణంగా వేగంగా కరోనా వ్యాపించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు.   తన కార్యాలయంకు వచ్చిన  దళిత నాయకులు చాట్రగడ్డ ప్రసాద్ (గడ్డం ప్రసాద్)కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అనంతరం మంత్రి పేర్ని నాని వెలుపలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాడేపల్లి హడావిడిగా ప్రయాణమయ్యారు.  
సిఫార్సు