విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరి తగతిన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధికి సంబంధించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన జియో-ట్యాగింగ్, రిజిస్ట్రేషన్లు, గ్రౌండింగ్ ప్రక్రియ త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ 89 శాతం, రిజిస్ట్రేషన్లు 67 శాతం పూర్తయ్యాయని ఈ నెల 25వ తేదీ లోగా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జియో ట్యాగింగ్ ప్రక్రియ తదితర అంశాలపై గురువారం ఆన్‌లైన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా మండలాల వారీగా ప్రత్యేక అధికారులో మాట్లాడారు. ఆయా లే అవుట్లలో జరిగిన ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్ణీత గడువులోగా సాంకేతిక ప్రక్రియలు అన్నీ పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్లు, గ్రౌండింగ్, తాగునీటి సదుపాయం, విద్యుత్తు సౌకర్యం తక్కువగా జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఇళ్ల స్థలాలకు జరిగిన జియో ట్యాగింగ్‌కు.. జిల్లా అధికారుల వద్ద ఉన్న జాబితాలకు వివరాల్లో తేడా ఉండటంతో సరి చేయాలని హౌసింగ్ పీడీకి కలెక్టర్ సూచించారు. తాగునీటి వసతికి సంబంధించి తీసుకున్న చర్యలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ రవికుమార్‌ను అడిగారు. విద్యుత్ సౌకర్య ఏర్పాట్లపై ఈపీడీసీఎల్ ఎస్ఈని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు త్వరితగతిన విద్యుత్ సౌకర్యం కల్పించాలని, సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను రెండు రోజుల్లో ముగించాలని ఆదేశించారు. డిజిటల్ అసిస్టెంట్ల సాయంతో గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. అలాగే జాబ్ కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోందని.. తగిన చర్యలు తీసుకొని సంబంధిత నివేదికను అందజేయాలని జేసీ వెంకటరావుకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల పరిధిలోని లేఅవుట్లలో సాంకేతిక ప్రక్రియలు తక్కువగా అయ్యాయని.. వీటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అలాగే మెటీరియల్‌కి సంబంధించి మైనింగ్ శాఖ అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీకి సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియ సజావుగా.. తప్పులు లేకుండా చేపట్టాలని పేర్కొన్నారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి..
జిల్లాలో ఇప్పటి వరకు 67 శాతం మాత్రమే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు అయ్యాయని వీటిని 100 శాతానికి చేర్చడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించటం ద్వారా రిజిస్ట్రేషన్ల సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ నెల 23వ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు రిజిస్ట్రేషన్లు చేయించాలని జేసీ వెంకటరావును కలెక్టర్ ఆదేశించారు. కర్ఫ్యూ నేపథ్యంలో ప్రత్యేక పద్ధతులను అనుసరించి ఆశాజనక ఫలితాలు సాధించాలని చెప్పారు.
పక్కాగా విద్యుదీకరణ పనులు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగనన్న కాలనీల్లో విద్యుదీకరణకు సంబంధించి సర్వేలు నిర్వహించి పనులు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. 50 ప్లాట్స్ లోపల ఉంటే స్థంబాల ద్వారా.. 1500 ప్లాట్స్ కంటే ఎక్కువ ఉన్న లేఅవుట్లలో భూగర్భ విద్యుత్ పనులు చేపట్టాలని సూచించారు. త్వరితగతిన డీపీఆర్ సమర్పించి సంబంధిత పనులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు.
సమావేశంలో జేసీలు కిశోర్ కుమార్, వెంకటరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమణ మూర్తి, ఆర్డీవో భవానీ శంకర్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ రవికుమార్, ఈపీడీసీఎల్ ఎస్ఈ విష్ణు, ప్రత్యేక అధికారులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, హౌసింగ్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.