సమన్వయంతో విజయవంతంగా కోవిడ్ వేక్సినేషన్..
Ens Balu
5
Kakinada
2021-05-21 07:34:26
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ క్రియాశీల భాగస్వామ్యంతో జిల్లాలో టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడ రమణయ్యపేటలోని నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి, వేసవి నేపథ్యంలో కేంద్రంలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారుల అర్హత వివరాల తనిఖీ ప్రక్రియతో పాటు వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ గదులను పరిశీలించారు. అక్కడి లబ్ధిదారులతో మాట్లాడి, స్లిప్‌లు ఎవరు ఇచ్చారో తెలుసుకున్నారు. మొదటి డోసు వేయించుకున్న తేదీని ఆధారంగా చేసుకొని వాలంటీర్లే ఇంటికి వచ్చి రెండో డోసు వేసేందుకు స్లిప్‌లు అందించినట్లు లబ్ధిదారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారులకు ముందే స్లిప్‌లు అందించే విధానం సత్ఫలితాలు ఇస్తోందని, ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం రెండో డోసు పంపిణీ జరుగుతోందని, వచ్చే నెల మొదటి నుంచి లబ్ధిదారులకు మొదటి డోసు పంపిణీ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వ్యాక్సినేషన్ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.