కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెండు కోవిడ్ ప్రచార రథాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. సెట్విజ్ ఆధ్వర్యంలో, నేచర్, వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ప్రచార రథాల ద్వారా ఒక్కో సంస్థా 11 మండలాల్లో కరోనా పట్ల ప్రజల్లో జాగృతి కల్గించేవిధంగా, ప్రచార కార్యక్రమాన్ని సెట్విజ్ రూపొందించింది. కోవిడ్‌పై పోరాటంలో స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేస్తామని, నెల రోజుల్లో వ్యాధిని గణనీయంగా కట్టడి చేయడం ద్వారా జిల్లాలో సాధారణ పరిస్థితిని తీసుకువస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. కరోనా పట్ల మరింత విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ఇటువంటి ప్రచార రథాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చినందుకు స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. ముఖ్యంగా ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న మండలాల్లో ఈ రథాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో కరోనా నియంత్రణకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలోనే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, నిర్వహణా బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తామని అన్నారు. పరిశ్రమలు కూడా బాధితులను ఆదుకొనేందుకు ముందుకు వస్తుండటం అభినందనీయమన్నారు. బాలల సంరక్షణకోసం జిల్లాలో మరో చైల్డ్ లైన్ ఏర్పాటు చేసేందుకు యునెసెఫ్ ముందుకు వచ్చిందని వెళ్లడించారు.
జిల్లాలో కరోనా కట్టడికి మూడంచెల విధానాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నివారణా చర్యల్లో భాగంగా, మాస్కుల ధారణ, భౌతిక దూరం, శానిటైజేషన్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే, మరోవైపు వేక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహిస్తామని చెప్పారు. ఇంతవరకు కరోనా రాని గ్రామాల్లో భవిష్యత్తులో కూడా వ్యాధి ప్రవేశించకుండా అడ్డుకోవడం, వచ్చిన గ్రామాల్లో పూర్తిగా నిర్మూలించడం ప్రధాన లక్ష్యాలుగా కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు కమిటీలు, సచివాలయ ఉద్యోగులతోపాటు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటామని అన్నారు. అందరి సమిష్టి కృషితో, మరికొద్ది రోజుల్లోనే జిల్లాలో సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, సెట్విజ్ ముఖ్య కార్య నిర్వహణాధికారి వి.విజయకుమార్, నేచర్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ జి.కె.దుర్గ, కో-ఆర్డినేటర్ మీనా, వరల్డ్ విజన్ కో-ఆర్డినేటర్లు జి.అంబేద్కర్, ఆర్.నాగేశ్వర్రావు, సెట్విజ్ సిబ్బంది పాల్గొన్నారు.