రైతులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం సింగనమల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశెనగ పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వేరుశనగ విత్తనం తీసుకునేలా రైతుల చేత రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించేందుకోసం గ్రామాల్లో టాంటాం వేయించాలని వ్యవసాయ శాఖ జెడి, వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులకు నాణ్యమైన కె6 రకం వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంతమంది రైతులు విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది రైతులకు విత్తనాన్ని పంపిణీ చేశారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, గత ఏడాది కూడా పొలాల్లో విత్తనాలు వేశారా, మీకు ఎన్ని బస్తాల వేరుశనగ ఇస్తున్నారు అనే వివరాలను ఆరా తీశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి చిన్నమ్మ మాట్లాడుతూ సింగనమల మండలంలో వేరుశెనగ విత్తన పంపిణీ చేస్తున్నామని, మండలంలో అర్హత కలిగిన రైతులు 3606 మంది ఉండగా, అందులో 427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారికి వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. సింగనమల మండలానికి 5015 క్వింటాళ్ల వేరుశనగను కేటాయించడం జరిగిందని, మండలంలోని ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు వేరుశనగ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.