ఉపాధిహామీ పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలి..జెసి


Ens Balu
3
Srikakulam
2020-08-28 18:14:51

శ్రీకాకుళం జిల్లాలోని ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ క్రింద సాధించాల్సిన పనుల ప్రగతిపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని  జిల్లా సంక్షేమ, ఆసరా సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జె.సి ఛాంబర్ లో జిల్లా నీటియాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ క్రింద జిల్లాలోని గ్రామ సచివాలయాలు, వై.యస్.ఆర్.ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణపు పనులను చేపట్టివలసి ఉందన్నారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను         ( యాక్షన్ ప్లాన్ ) అధికారులు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాలలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను ముందుగా తెలుసుకోవాలని, ఆ పనులు మినహా జిల్ల్లాలోని మిగిలిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు జిల్లాలో చేపట్టవలసిన పనుల ప్రగతిపై ప్రణాళికలు వేయాలని, వాటిని ఎన్ని రోజులలో పూర్తిచేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిల్లోనూ అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను కోరారు.  ఈ సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ అదనపు పథక సంచాలకులు పి.లక్ష్మీపతి, పంచాయతీ రాజ్ శాఖ శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ కార్యనిర్వాహక ఇంజినీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.