బ్లాక్ ఫంగస్ పై ఆందోళన వద్దు..


Ens Balu
3
కలెక్టరేట్
2021-05-21 12:03:15

బ్లాక్ ఫంగ‌స్ (నాసో ఆర్బిట‌ల్ మెనింగ్ మ్యుక‌ర్ మైకోసిస్‌) వ్యాధిపై ఎవ‌రూ అన‌వ‌స‌ర అందోళ‌న‌కు గురికావొద్ద‌ని.. భ‌య‌ప‌డ వ‌ద్ద‌ని జేసీ డా. ఆర్‌. మహేష్ కుమార్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందు జాగ్ర‌త్త‌గా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక ఏర్పాటు ఏర్పాటు చేసి సేవ‌లందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. నిరంతరం వైద్య బృందం అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. క‌రోనా నుంచి కోలుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఆ వ్యాధి సోక‌ద‌ని.. కావున అన‌వ‌స‌ర ఆందోళ‌న‌కు గురికావొద్ద‌ని ధైర్యం చెప్పారు. ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ర‌కాల చ‌ర్యలూ తీసుకుంటున్నామ‌ని, వ్యాధి సోకిన వారికి ప్ర‌భుత్వం ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తుంద‌ని వివ‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ జిల్లా కేంద్రాసుప‌త్రి సూపరింటెండెంట్ డా. సీతారామ‌రాజు, మైక్రోబ‌యోలిజిస్టు డా. శ్ర‌వంతిల‌తో శుక్ర‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెంద‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అవ‌స‌ర‌మైన వైద్యుల‌ను, సిబ్బందిని, స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని సూచించారు.

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డామురా దేవుడా అనుకునే స‌రికి కొత్తగా వ‌చ్చిన బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ వ్యాధిని అరిక‌ట్టడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇది వ‌ర‌కే కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఖ‌రీదైన చికిత్స కాబ‌ట్టి ఒక వేళ ఎవ‌రికైనా బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తే ఆరోగ్య శ్రీ ప‌థకంలో భాగంగా చికిత్స అందించేందుకు నిర్ణ‌యించింది. జిల్లాల్లో త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌జ‌ల  ప్రాణాలు కాపాడాల‌ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం. హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ ఆధ్వ‌ర్యంలో అధికార యంత్రాంగం త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది. 20 ప‌డ‌క‌ల‌తో కూడిన‌ ప్ర‌త్యేక వార్డు, అందులో వైద్య నిపుణులు ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్ర‌స్తుతం అందిరిలోనూ భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తోన్న ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు వ‌స్తుంది. ఎవ‌రికి వ‌స్తుంది. ల‌క్ష‌ణాలు ఏంటి. ఒక వేళ వ‌స్తే చికిత్స ఏంటి.. ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు అధికారులు, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి తెలుసుకుందాం. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుందాం.

బ్లాక్ ఫంగ‌స్‌ ఎవ‌రికి వ‌చ్చే అవ‌కాశం ఉంది

నాసో ఆర్బిట‌ల్ మెనింగ్‌ మ్యుక‌ర్ మైకోసిస్ లేదా రీనో సెరిబ్ర‌ల్ మ్యుక‌ర్ మైకోసిస్‌గా పిలిచే బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి ముదిరితే ప్రాణాపాయం వ‌ర‌కు తీసుకెళుతుంది. ముక్కు నుంచి కంటికి.. కంటి నుంచి మెద‌డుకు చేరుకొని అవ‌యవాల‌ను పాడుచేస్తుంది. నియంత్ర‌ణ లేని మ‌ధుమేహ రోగులకు ఎక్కువ‌గా ఈ ఫంగ‌స్ సోకే ప్ర‌మాద‌ముంద‌ని వైద్య నిపుణులు తేల్చారు. అలాగే సైన‌సైటిస్ ఉన్న వారికి ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్లు వైద్యులు ఇప్ప‌టికే గుర్తించారు. ఐసీయూలో ఎక్కువ కాలం ఉండి చికిత్స పొందిన వారికి ప్ర‌మాద‌ముంది. క‌రోనా సోకి ప‌రిస్థితి తీవ్ర‌మైన వారికి స్టెరాయిడ్స్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి. క‌రోనా త‌గ్గిపోవాల‌నే ఉద్దేశంతో మ‌ధుమేహ రోగుల‌కు విచ‌క్ష‌ణా ర‌హితంగా కొన్ని ఆసుప‌త్రుల్లో స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ ప్రాణాధార మందులే అయిన‌ప్ప‌టికీ మితిమీరి వాడ‌టం వల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. ఈ ఫంగ‌స్ గాలి పీల్చుకోవ‌టం ద్వారా ఎక్కువ‌గా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వెంటిలేట‌ర్లు శుభ్రం చేయకుండా ఎక్కువ కాలం వాడ‌టం కూడా వ్యాధి సోక‌డానికి కార‌ణ‌మ‌ని పేర్కొంటున్నారు.

ల‌క్ష‌ణాలు ఏంటి...

క‌రోనా బారిన ప‌డి ఎక్కువ కాలం ఐసీయూలో చికిత్స పొందిన వారు స్టెరాయిడ్స్ వినియోగించిన వారిలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉండొచ్చు. క‌రోనా చికిత్స అనంత‌రం 10 నుంచి 15 రోజుల్లోపు ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలాగే మొహం వాపు. కింటి గుడ్డు కింద ఎర్ర‌బడి దుర‌ద‌గా ఉండ‌టం. ముక్కులో దుర‌ద వేయ‌టం. ప‌దేప‌దే ముక్కును న‌లిపేయాలి అనిపించ‌టం. ముక్కు నుంచి న‌ల్ల‌టి ద్ర‌వం కార‌టం. క‌ళ్ల‌పైనా లేదా కింద చిన్న బొబ్బ‌లు రావ‌టం. ఉబ్బిన‌ట్లు అనిపించ‌టం. కంటి చూపు త‌గ్గిపోవ‌టం.. మ‌సక మ‌స‌క‌గా క‌నిపించ‌టం. దంతాల్లో నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబార‌టం కూడా వ్యాధి ల‌క్ష‌ణాలు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా కేంద్రాసుప‌త్రిలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వార్డులో ఉన్న వైద్య బృందాన్ని సంప్ర‌దించాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఎలాంటి చికిత్స అందిస్తారు...

ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. ఒక వేళ ఎవ‌రికైనా వ్యాధి సోకితే చికిత్స అందించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉంది. 20 కేసుల‌కు స‌రిప‌డా మందుల‌ను అందుబాటులో ఉంచుకున్నారు. వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి 21 రోజుల పాటు చికిత్స అవ‌స‌రమ‌ని డా. శ్ర‌వంతి తెలిపారు. అలాగే 21 రోజుల పాటు ఏంఫోటెరిసిన్ ఇంజెక్ష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పారు. చికిత్స అనంత‌రం 45 రోజుల పాటు పోసోకానజోల్ మాత్ర‌లు వేసుకోవాల‌ని అప్ప‌డు వ్యాధి పూర్తిగా న‌య‌మవుతుంద‌ని వివ‌రించారు.  

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏమిటి..

ముందుగా క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, సామాజిక దూరం పాటించుట వంటి నియ‌మాలు పాటించాలి. ధూళి ఉన్న ప్ర‌దేశాల్లో, నిర్మాణాలు జ‌రిగే ప్రాంతాల్లో తిర‌గ‌కుండా ఉండాలి. ఒక వేళ క‌రోనా సోకితే.. సాధ్య‌మైనంత వ‌ర‌కు మామ్మూలు మందులతో న‌య‌మైపోయేలా చూసుకోవాలి. శ్వాసకు సంబంధించిన ఎక్స‌ర్‌సైజ్‌లు చేయాలి. మోతాదుకు మించి స్ట‌రాయిడ్స్ వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇమ్యునో మోడ్యులేటింగ్ డ్ర‌గ్స్‌ను నిలిపివేయటం. ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు, వైద్య నిపుణులు చెబుతున్నారు. 

జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

బ్లాక్ ఫంగ‌స్‌గా పిలిచే ఈ వ్యాధి జిల్లాలో ఏవ్వ‌రికీ సోక‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేదు. రాష్ట్రంలో సుమారుగా 20 కేసులు న‌మోదు కాగా..  ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో మాత్రం చాలా త‌క్కువ‌గా న‌మోద‌య్యాయి. శ్రీ‌కాకుళం నుంచి ఒక‌టి, విశాఖ‌ప‌ట్టణంలో అయిదు కేసులు న‌మోదయ్యాయి.   మ‌న జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌లేద‌ని డా. సీతారామ‌రాజు పేర్కొన్నారు. 

ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
ః డా. ఆర్‌. మ‌హేష్ కుమార్‌, సంయుక్త క‌లెక్ట‌ర్‌

ఈ వ్యాధిపై ఇప్ప‌టికీ వైద్య నిపుణుల‌తో చ‌ర్చించాం. కేంద్రాసుప‌త్రి సూప‌రింటెండెంట్ ఆధ్వ‌ర్యంలో మ‌హారాజ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు చేశాం. అందులో నిత్యం వైద్యులు అందుబాటులో ఉంటారు. వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన వెంట‌నే మ‌హారాజ ఆసుప‌త్రిలో ఏర్పాటు చేసిన సెల్‌లో సంప్ర‌దిస్తే వెంట‌నే వైద్య‌ప‌ర‌మైన సేవ‌లు అందిస్తాం. జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోద‌వ్వ‌న‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా అన్ని ర‌కాల వైద్య ప‌రమైన ఏర్పాట్లు చేశాం. వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఎలాంటి భ‌యానికీ గురికావొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాం. అధికార యంత్రాంగం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది.

జాగ్ర‌త్త‌లు పాటిస్తే ఏం కాదు...
ః డా. సీతారామ‌రాజు, సూప‌రింటెండెంట్‌, మ‌హారాజ ఆసుప‌త్రి

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత 10 నుంచి 15 రోజుల్లో వ్యాధి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. కావున క‌రోనా నుంచి చికిత్స పొందిన ఇంటికెళ్లిన త‌ర్వాత కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. దుమ్ము, ధూళి, నిర్మాణ ప్రాంతాల్లో ఎక్క‌వ‌గా తిర‌గ‌కూడ‌దు. రోగ నిరోధ‌క శక్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిపైనే దీని ప్ర‌భావం ఉంటుంది. కావున మంచి ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాలి. మాస్కు ధ‌రించుట‌, భౌతిక దూరం పాటించుట చేయాలి. నియ‌మాలు పాటిస్తూ ప‌రిశుభ్ర‌త పాటిస్తే ఈ వ్యాధి ద‌రిచేర‌దు. దీనిపై అన‌వ‌స‌రమైన ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. క‌లెక్ట‌ర్‌, జేసీల సూచ‌న‌ల మేర‌కు జిల్లా కేంద్రాసుప‌త్రిలో ముందస్తుగా 20 ప‌డ‌క‌ల‌తో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు చేశాం. అందులో ఇద్ద‌రు వైద్య నిపుణులు, ఇద్ద‌రు ల్యాబ్ టెక్నీషియ‌న్స్‌, ప‌రీక్ష‌లు చేయించేందుకు గాను మైక్రోబ‌యోల‌జిస్టు డా. శ్ర‌వంతి అందుబాటులో ఉంటారు. ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వీరిలో ఎవ‌రిని సంప్ర‌దించినా వైద్య సేవ‌లు వెంట‌నే అందుతాయి. 

సిఫార్సు